DK Aruna: కేసీఆర్ ఆదేశాలతోనే సంజయ్‌ కాన్వాయ్‌పై దాడి: డీకే అరుణ

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.

Updated : 24 Sep 2022 15:07 IST

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన భాజపా నేతలు

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికను జీర్ణించుకోలేకే భాజపా నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, నల్గొండ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాన్వాయ్‌పై దాడి ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం భాజపా నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే బండి సంజయ్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిందని డీకే అరుణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తెరాస నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఐకేపీ కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతోందని ఆక్షేపించారు. రైతు సమస్యలపై తమ పార్టీ అధ్యక్షుడు జిల్లాల్లో పర్యటిస్తుంటే దాడులకు పాల్పడటం సరికాదన్నారు. సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ బండి సంజయ్‌ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు భాజపా పోరాడుతుందని లక్ష్మణ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని