UP Polls: ‘6 యాత్రలతో ప్రజల్లోకి వెళ్తాం.. 300+ స్థానాల్లో గెలుస్తాం..’

ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భాజపా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆరు యాత్రల్ని చేపట్టాలని నిర్ణయించింది. ....

Published : 01 Dec 2021 01:33 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భాజపా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆరు యాత్రల్ని చేపట్టాలని నిర్ణయించింది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌, ఇతర పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. 2022లో జరగబోయే ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఆరు యాత్రలతో ప్రజలకు చేరువ కానున్నట్టు స్వతంత్ర దేవ్‌ సింగ్ అన్నారు. పార్టీ కార్యకర్తల బలం, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో భాజపా 300లకు పైగా స్థానాలు గెలుచుకొని తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ట్విటర్లో విశ్వాసం వ్యక్తంచేశారు. మరోవైపు, ఈ ఆరు యాత్రల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యాలను ప్రజలకు వివరించనున్నట్టు మరో నేత తెలిపారు. ఈ యాత్రలకు సంబంధించిన ఇతర వివరాల్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉందన్నారు. 

2017లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా భాజపా పరివర్తన్‌ యాత్రల పేరుతో నాలుగు యాత్రలు చేపట్టింది. అప్పట్లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. భయం, అవినీతిలేని యూపీని చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 403 స్థానాలకు గాను భాజపా 312 స్థానాలతో భారీ విజయాన్ని అందుకోగా.. ఆ పార్టీ మిత్రపక్షాలు మరో 13స్థానాల్ని గెలుచుకున్నాయి.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని