Sharad Pawar: యూపీలో ఎన్నికలు లేకుంటే.. సాగుచట్టాలు రద్దు కాకపోయేవే!

ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు లేకుంటే సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉండకపోయేదని ఎన్‌సీపీ అధినేత శదర్‌ పవార్‌ ఆరోపించారు.

Updated : 25 Nov 2021 17:22 IST

ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ ఆరోపణ

పుణె: ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు లేకుంటే సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉండకపోయేదని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆరోపించారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో పర్యటించిన ఆయన.. శివసేన నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడి (MVA) కూటమి ఐదేళ్లు పూర్తిగా అధికారంలో కొనసాగుతుందని భరోసా వ్యక్తం చేశారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా.. ఈ మూడుపార్టీల కూటమినే మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు.

‘ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయ్‌. మాకున్న సమాచారం ప్రకారం, ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీ నేతలు (భాజపాని ఉద్దేశిస్తూ) గ్రామాల్లో పర్యటించినప్పుడు.. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో వారికి అర్థమయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఓట్లకోసం వెళ్లినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో.. ఎలాంటి శిక్ష విధిస్తారోననే విషయాన్ని వారు ముందుగానే పసిగట్టారు. దీన్ని పరిగణనలోకి తీసుకునే సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది’ అని ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

ఇక మహారాష్ట్రలో వచ్చే జనవరిలో ప్రభుత్వం మారబోతుందంటూ అక్కడి భాజపా అధ్యక్షుడు చేసిన ప్రకటనపైనా శరద్‌ పవార్‌ స్పందించారు. తమ కూటమి ఏర్పడినప్పుడు కేవలం 15 రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోతుందని అన్నారని.. కానీ, ఇప్పటికే తాము అధికారం చేపట్టి రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నామని గుర్తుచేశారు. మిగతా పదవీకాలాన్ని కూడా విజయవంతంగా పూర్తిచేస్తామని ఎన్‌సీపీ అధినేత ధీమా వ్యక్తం చేశారు. ఇక దర్యాప్తు పేరుతో అధికార పార్టీ నేతలపై కేంద్ర సంస్థల వేధింపులు ఎక్కువయ్యాయన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి ఇదే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే, నూతన సాగు చట్టాలపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదిత బిల్లుకు కేంద్ర కేబినెట్‌ నేడు ఆమోదముద్ర వేసింది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని