Chandrababu: ఓటీఎస్‌ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా?: చంద్రబాబు

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పేరుతో వైకాపా నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Updated : 06 Dec 2021 16:37 IST

అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పేరుతో వైకాపా నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా? అని నిలదీశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఓటీఎస్‌ పేరుతో బలవంతంగా వసూలు చేస్తూ.. స్వచ్ఛందమంటారా? అని ప్రశ్నించారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్‌కు అలవాటైందని ఎద్దేవా చేశారు. తప్పుడు కేసులు పెడితే ప్రజలు భయపడతారని అనుకుంటున్నారా? అని మండిపడ్డారు.

‘‘ఇళ్ల మీదున్న రుణాన్ని మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చి మాట తప్పారు. వైద్యానికి దాచుకున్న సొమ్మును ఓటీఎస్ కోసం వసూలు చేస్తారా? బొబ్బిలిలోని ఓటీఎస్ బాధిత కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది. ఆ బాలుడికి వైద్య ఖర్చులు తెదేపానే భరిస్తుంది. పులిచింతల ప్రాజెక్టు కోసం భూములిచ్చి పునరావాసంలో భాగంగా ఇళ్లు తీసుకున్న పేదల నుంచి ఓటీఎస్ వసూలు చేస్తారా? గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అవినీతిమయంగా మార్చారు. రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్లే చేయాలి. ఎవరు పడితే వారు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ డాక్యుమెంట్లను వైకాపా రంగుల్లో ఇస్తారా?ఈ సీఎం భూమి ఇచ్చారా..? రుణం ఇచ్చారా..? నిర్మాణానికి ఖర్చులు ఇచ్చారా? ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేంటి. తప్పనిసరి కాదంటూనే ఓటీఎస్ పేరుతో ఒత్తిడి తీసుకొచ్చి సొమ్ము వసూలు చేస్తున్నారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణాన్ని పట్టించుకోలేదు

రాజధాని అమరావతి ప్రాంతంలో తాము నిర్మించతలపెట్టిన అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. విగ్రహ నిర్మాణం కోసం తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కూడా రద్దు చేశారని మండిపడ్డారు. అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణానికి తమ ప్రభుత్వ హయాంలో 20 ఎకరాల భూమి కూడా ఎంపిక చేశామన్నారు. దేశానికే ఆదర్శమైన నిర్ణయాన్ని తాము తీసుకుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆక్షేపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని