TS Assembly: దళితబంధుకు నిధులు ఎక్కడి నుంచి?సీఎం స్పష్టతివ్వాలి: భట్టి

సమాజంలో దళితులు, పేదలు ఎదగాలని కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ కోరుకుంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

Updated : 30 Sep 2022 15:34 IST

హైదరాబాద్‌: సమాజంలో దళితులు, పేదలు ఎదగాలని కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ కోరుకుంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ‘దళితబంధు’ అమలు కావాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఈ పథకంపై సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందన్నారు. శాసనసభలో దళితబంధుపై జరిగిన చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ దళితబంధు అమలు చేయాలన్నారు. అయితే ఈ పథకానికి నిధులు ఎలా కేటాయిస్తారనేదానిపై సీఎం స్పష్టత ఇవ్వాలని కోరారు. దానిపై స్పష్టత వచ్చినపుడే సభలో అర్థవంతమైన చర్చ జరుగుతుందన్నారు. 

ఈ సందేహాలపైనా క్లారిటీ ఇవ్వాలి..

దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా అర్హులందరికీ న్యాయం జరిగేలా చూడాలని భట్టి విక్రమార్క ప్రభుత్వానికి సూచించారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలన్నారు. దీనికి సంబంధించిన కమిటీల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులకు అవకాశం కల్పించాలని.. వాళ్ల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలన్నారు. దీన్ని సీఎం పరిశీలించాలని భట్టి సూచించారు. దళితులకే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకూ దళితబంధు తరహా పథకం అమలు చేయాలని కోరారు. దళితబంధు లబ్ధిదారులు రూ.10లక్షలతో ఒక్క వ్యాపారమే చేసుకోవాలా?నచ్చిన వ్యాపారాలు చేసుకోవచ్చా? కొంతమంది గ్రూపుగా ఏర్పడి పెద్ద వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశముంటుందా? స్థానికంగానే ఉండాలా? ఎక్కడైనా చేసుకోవచ్చా? వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా అవసరమైన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? లబ్ధిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారా?రేషన్‌ కార్డు లేకపోతే అర్హులుగా పరిగణిస్తారా? లేదా? వివాహ ధ్రువీకరణ ఉంటే సరిపోతుందా?తదితర సందేహాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని భట్టి కోరారు.

ప్రజలే తిరుగుబాటు చేస్తారు

అంతకుముందు గన్‌పార్కు వద్ద మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడారు. పోడు భూముల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. గిరిజనుల నుంచి భూములు లాక్కుంటున్నారని.. వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆక్షేపించారు. పంటలు వేసే సమయంలో అటవీ సిబ్బంది దాడులు చేస్తున్నారన్నారు. పోడు భూములపై వాయిదా తీర్మానం ఇస్తే అవకాశం ఇవ్వలేదని .. మైక్‌ ఇవ్వకుండా తమ గొంతునొక్కుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజలే తిరుగుబాటు చేస్తారని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు