Hindu Vs Hindutva: హిందువు అయితే మరి హిందుత్వ ఎందుకు..?

దేశంలో గతకొంత కాలంగా హిందూ మతం, హిందుత్వ గురించి చర్చ నడుస్తోందని.. ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు

Updated : 24 Sep 2022 15:31 IST

ప్రశ్నించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

దిల్లీ: దేశంలో గతకొంత కాలంగా హిందూ మతం, హిందుత్వ గురించి చర్చ నడుస్తోందని.. ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ మీరు హిందువు అయితే ఇక హిందుత్వ అవసరమేముంది? దీనికి కొత్త పేరెందుకు? అంటూ రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. మహారాష్ట్రలోని వార్ధాలో నాలుగు రోజులపాటు జరుగనున్న ఏఐసీసీ అవగాహన కార్యక్రమాన్ని రాహుల్‌ గాంధీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ భావజాలంపై మరోసారి మండిపడ్డారు. గతంలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్‌ విఫలమైందని అంగీకరించిన ఆయన.. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.

సజీవంగానే కాంగ్రెస్‌ సిద్ధాంతాలు..

‘హిందూ మతం అంటే ఇతర వర్గాలపై దాడి చేయడమా..? కానీ, హిందుత్వ అంటే మాత్రం అదే. ఏ పుస్తకంలో రాసివుంది..? నేను ఉపనిషత్తులను కూడా చదివాను. కానీ, ఇప్పటివరకు వీటి గురించి నేనెక్కడ చూడలేదు, చదవలేదు’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ఒకవేళ రెండూ ఒకటే అయితే వేర్వేరు పేర్లు ఎందుకని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్‌పార్టీ సిద్ధాంతం మాత్రం ఓ ‘అందమైన ఆభరణం’ లాంటిదని అభివర్ణించిన ఆయన.. అందులో అద్భుతమైన శక్తి దాగి ఉందన్నారు. కానీ, భాజపా దేశం మొత్తం వ్యాపించడంతోపాటు మీడియాను కూడా చేతుల్లోకి తీసుకోవడం వల్లే కాంగ్రెస్‌ గొప్పతనం పాక్షికంగా కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ సిద్ధాంతాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని.. రానున్న రోజుల్లో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ఇవి మరుగున పడేస్తాయని రాహుల్‌ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.

తిప్పికొట్టిన భాజపా..

భారతీయ జనతా పార్టీపై తాజాగా రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలను ఆ పార్టీ తిప్పికొట్టింది. హిందుత్వపై కాంగ్రెస్‌ పార్టీ దాడి చేయడం బాధాకరమైన విషయమని పేర్కొంది. ‘‘హిందూ మతాన్ని సల్మాన్‌ ఖుర్షిద్‌ ఐఎస్‌ఐఎస్‌తో పోలుస్తారు. శశిథరూర్‌ ‘హిందూ తాలిబన్’ అంటారు. దిగ్విజయ్‌, మణిశంకర్‌ అయ్యర్‌ వంటి నాయకులు ‘కాషాయ ఉగ్రవాదం’ అని అభివర్ణిస్తారు. ఇవన్నీ యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. వీటన్నింటికీ రాహుల్‌ గాంధీనే నాయకుడు’’ అని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని