Kalyan ram: వ్యక్తిగత విమర్శలు సరైన విధానం కాదు: కల్యాణ్‌రామ్‌

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై పలువురు నేతలు అసభ్యంగా కామెంట్లు చేయడంపై నటుడు నారా రోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు....

Updated : 20 Nov 2021 17:04 IST

నిన్నటి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నటుడు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై పలువురు నేతలు వ్యక్తిగతంగా అవమానకరరీతిలో వ్యాఖ్యలు చేయడంపై సినీ నటులు నందమూరి కల్యాణ్‌రామ్‌, నారా రోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాక్‌ స్వాతంత్ర్య హక్కును ఉపయోగించుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని అన్నారు. ఈ మేరకు శనివారం ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేశారు.

నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి, అదీ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావటం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.


‘‘ఉన్నత విలువలతో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో నిన్న కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసభ్యపదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు.. విధానాలపై ఉండాలి కానీ కుటుంబసభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్ర్య హక్కును దుర్వినియోగం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడం తగదు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండటం వల్లే మీ మనుగడ సాగింది. ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉండటం వల్లే సంయమనంతో ఉన్నాం. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు నిన్నటితో మీ వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక, మీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారు. ఈ వికృత క్రీడలను వెనుక ఉండి ఆడిస్తోన్న వారు కూడా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి స్థాయిలేని వ్యక్తుల మధ్యలో మీరు రాజకీయం చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటాం’’ అని నారారోహిత్‌ పేర్కొన్నారు.


‘‘తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యుల్ని కించపరిచేలా కొందరు వ్యక్తులు వ్యాఖ్యలు చేయడం బాధాకరమైన విషయం. మీడియా సమావేశంలో ఆయన కంటతడి పెట్టడం తీవ్ర మనస్తాపానికి గురి చేసింది’’ - సినీ దర్శకుడు, రాఘవేంద్రరావు.

‘‘తెలుగుప్రజల అభిమానాన్ని మెండుగా పొందిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ మాత్రం స్థాయిలేని కొంతమంది వ్యక్తులు ఆయన కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం బాధాకరమైన విషయం’’ - నిర్మాత అశ్వినీదత్‌

‘‘తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరం. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉంది’’ - బండ్లగణేశ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని