
Kejriwal: సిద్ధూకు కేజ్రీవాల్ ప్రశంసలు.. ఆయన్ను తొక్కేస్తున్నారంటూ వ్యాఖ్య
అమృత్సర్: ప్రజా సమస్యలపై ఎప్పుడూ తన గళాన్ని వినిపిస్తారంటూ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పొగడ్తలతో ముంచెత్తారు. ఇదే సమయంలో మునుపటి ముఖ్యమంత్రితోపాటు ప్రస్తుత సీఎం నుంచి సిద్ధూ అణచివేతకు గురౌతున్నారని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్‌లో పర్యటించిన కేజ్రీవాల్.. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు ఎంపీలు ఆమ్ఆద్మీ పార్టీలో (AAP) చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అయితే, ఇతర పార్టీల నుంచి వచ్చే చెత్తను తాము చేర్చుకోబోమని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
‘సిద్ధూ ధైర్యాన్ని నేను ప్రశంసించాను. రాష్ట్రంలో ఒక క్యుబిక్ అడుగు ఇసుకను రూ.5కే అమ్ముతున్నట్లు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన ప్రకటనను సిద్ధూ తప్పుబట్టారు. అది అబద్ధం.. క్యుబిక్ అడుగు ఇసుకను ఇప్పటికీ రూ.20కే అమ్ముతున్నారంటూ సీఎం చేసిన తప్పుడు ప్రకటనను సరిదిద్దారు. అందుకే ఆయనను ప్రశంసించాను’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘అంతేకాకుండా ప్రజల సమస్యలనే నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ఎప్పుడూ లేవనెత్తుతారు. కానీ, మాజీ సీఎం అమరీందర్ సింగ్ చేతిలో అణచివేతకు గురైన సిద్ధూ.. ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీ చేతిలోనూ అదేవిధంగా అణచివేతకు గురవుతున్నారు. సిద్ధూ గొప్పగా పనిచేస్తున్నారు’ అని అరవింద్ కేజ్రీవాల్ పోగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా పంజాబ్ సీఎంపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్.. ఉచిత కరెంటు, మొహల్లా క్లినిక్‌ల ఏర్పాటుపై ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చరణ్‌జిత్ సింగ్ విఫలమయ్యారని దుయ్యబట్టారు.
ఇక పంజాబ్‌లో ఆమ్ఆద్మీపార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటూ కాంగ్రెస్, భాజపాలు ప్రశ్నించడంపైనా అరవింద్ కేజ్రీవాల్ దీటుగా స్పందించారు. ‘పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ తన సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. యూపీలో భాజపా కూడా యోగి పేరును లేదా ఇతర అభ్యర్థిని వెల్లడించలేదు. గోవా, ఉత్తరాఖండ్‌లోనూ ఆ పార్టీలది అదే పరిస్థితి. అయినప్పటికీ వారికంటే ముందే మేం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం’ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.