Mamata Banerjee: కేంద్రంలో నిరంకుశ పాలన.. యూపీలో కిల్లింగ్‌ రాజ్‌..!

ఓవైపు కేంద్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుండగా..  యూపీలో మాత్రం కిల్లింగ్‌ రాజ్‌ నడుస్తోందని దుయ్యబట్టారు.

Published : 05 Oct 2021 01:41 IST

భాజపాపై విరుచుకుపడిన మమతా బెనర్జీ

కోల్‌కతా: రైతుల ఆందోళనల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపుర్‌ ఖేరీలో నలుగురు రైతులు మృత్యవాతపడిన ఘటనను పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఓవైపు కేంద్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుండగా..  యూపీలో మాత్రం కిల్లింగ్‌ రాజ్‌ నడుస్తోందని దుయ్యబట్టారు. లఖింపుర్‌ ఖేరీలో బాధిత రైతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లే రాజకీయ పార్టీల ప్రతినిధులకు అనుమతి నిరాకరించడంపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.

‘దేశంలో నడుస్తోంది ప్రజాస్వామ్యం కాదు, నిరంకుశ పాలన మాత్రమే. ఉత్తర్‌ప్రదేశ్‌లో రైతులు దారుణంగా హత్యకు గురయ్యారు. అయినప్పటికీ వాస్తవాలు బయటకు రావడం భాజపాకు ఇష్టం లేదు. అందుకే లఖింపుర్‌లో సెక్షన్‌ 144 విధించారు. రానున్న మరికొన్ని రోజుల్లో ప్రజలే వారిపై 144 సెక్షన్‌ విధిస్తారు. అక్కడి స్థానికులను కలిసేందుకు వెళ్లే రాజకీయ నాయకులను అడ్డుకుంటున్నారు’ అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిస్థితి తలెత్తినందుకు యూపీ సీఎం రాజీనామా చేయాలా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో వారు హామీ ఇచ్చినట్లుగా రామరాజ్యం తీసుకురావడానికి బదులుగా కిల్లింగ్‌ రాజ్‌ కొనసాగుతోందని విమర్శించారు.

ఇదిలాఉంటే, లఖింపుర్‌ ఖేరీలో ఆదివారం నాడు ఆందోళన చేస్తోన్న రైతులపైకి కార్లు దూసుకువెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన దాడిలో మరో నలుగురు పౌరులు మృత్యువాతపడ్డారు. ఆ ఘటనలో మొత్తం 8మంది మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పంజాబ్‌, హరియాణ, పశ్చిమబెంగాల్‌, దిల్లీ నుంచి విపక్షపార్టీ నేతలు అక్కడి చేరుకునే ప్రయత్నం చేశాయి. కానీ, ముందస్తుగా లఖింపుర్‌ ఖేరీలో సెక్షన్‌ 144 విధించి బయటివ్యక్తులు, రాజకీయపార్టీలు లఖింపుర్‌ జిల్లాలోకి అడుగు పెట్టకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని