
తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్
గోవాలో పర్యటిస్తోన్న మమతా బెనర్జీ
దిల్లీ: పశ్చిమ్ బెంగాల్‌లో భాజపాపై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న టీఎంసీ.. దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మూడు రోజుల పాటు గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని పార్టీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఆయనతో పాటు నటి నఫీసా ఆలీ కూడా ఈ రోజు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తాను ఇక్కడకు వచ్చింది ముఖ్యమంత్రి అయ్యేందుకు కాదని, భాజపా దాదాగిరికి చెక్ పెట్టేందుకని కొంకణీ భాషలో మాట్లాడి గోవా వాసుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘ నేను బయట వ్యక్తిని కాదు. భారతీయురాలిని. నేను ఎక్కడికైనా వెళ్లగలను. బెంగాల్ నా మాతృభూమి అయితే, గోవా కూడా మాతృభూమే. నేను గోవా సీఎం అయ్యేందుకు రాలేదు. దిల్లీ నుంచి ఎదురయ్యే దాదాగిరిని అడ్డుకోవడానికి వచ్చాను. వారి మనసు కలుషితమైంది. వారు నాకు నల్లజెండాలు చూపించారు. నేను మాత్రం వారికి నమస్కారమే పెట్టాను’ అని భాజపాపై విమర్శలు చేశారు. ‘మనం ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం. గోవా చాలా అందంగా ఉంటుంది. మనకు చేపలంటే ఇష్టం. మన రెండు రాష్ట్రాలు ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాయి’ అంటూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సారుప్యాలను వెల్లడించారు. అలాగే లియాండర్ పేస్ చేరిక గురించి మాట్లాడుతూ..‘లియాండర్ పేస్ టీఎంసీలో చేరారని తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నాకు సోదర సమానుడు. నేను యువజన శాఖ మంత్రిగా ఉన్పప్పటి నుంచే ఆయన నాకు తెలుసు’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం రాజధాని నగరం పనాజీలో జరిగింది.