Ap News: మళ్లించిన నిధులు పంచాయ‌తీల ఖాతాల్లో జ‌మ‌ చేయాలి: నారా లోకేశ్‌

గ్రామ పంచాయతీల నుంచి మ‌ళ్లించిన రూ.1,309 కోట్లు త‌క్షణ‌మే పంచాయ‌తీల ఖాతాల్లో జ‌మ‌ చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 30 Nov 2021 17:19 IST

అమరావతి: గ్రామ పంచాయతీల నుంచి మ‌ళ్లించిన రూ.1,309 కోట్లు త‌క్షణ‌మే పంచాయ‌తీల ఖాతాల్లో జ‌మ‌ చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్‌కు లోకేశ్‌ బహిరంగ లేఖ రాశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, భూములను తాకట్టు పెట్టడం.. ఈ మూడింటిపై ఆధారపడి పాల‌న సాగిస్తున్నారన్నారని ఆరోపించారు. ఈ మూడు దారులు మూసుకుపోయిన తర్వాత ఇప్పుడు నిధుల మళ్లింపుపై పడ్డారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,918 పంచాయ‌తీల నుంచి రెండున్నరేళ్ల పాల‌న‌లో రూ.1,309 కోట్లకు పైగా నిధులు మ‌ళ్లించ‌డం ద్వారా కనీసం పంచాయ‌తీ పారిశుద్ధ్య ప‌నుల‌కి కూడా నిధులు లేకుండా చేశారని మండిపడ్డారు.

‘‘గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, సానిటేషన్, లైటింగ్ ప‌నుల కోసం గ్రామ‌ పంచాయ‌తీల‌కు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధుల‌ను మళ్లించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయి. ప‌ల్లెల్లో పారిశుద్ధ్యం పూర్తిగా దిగ‌జారిపోవడంతో పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయ‌తీల‌కు నేరుగా ఇచ్చిన నిధులను పంచాయ‌తీ ఖాతాల నుంచి మళ్లించడం రాజ్యాంగ‌ విరుద్ధం. సుమారు 4 నెలల క్రితం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.344 కోట్లను విద్యుత్ బకాయిల క్రింద జ‌మ చేసుకున్నామని ఇప్పుడు ఆర్థిక‌మంత్రి ప్రక‌టించ‌డం బాధ్యతారాహిత్యమే అవుతుంది. 1984లో అప్పటి ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు ఎటువంటి ఆదాయం లేని మైనర్ పంచాయతీల్లోని వీధి దీపాలకు ఉచిత విద్యుత్‌ని అందించారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ముఖ్యమంత్రులు కూడా అదే విధానాన్ని కొనసాగించారు. గ్రామ పంచాయతీల నుంచి మ‌ళ్లించిన నిధులను త‌క్షణ‌మే పంచాయ‌తీల ఖాతాల్లో జ‌మ‌ చేయాలి. ఉచిత‌ విద్యుత్ ప్రయోజ‌నం అందుకుంటోన్న పంచాయ‌తీల నుంచి కార్యవ‌ర్గాల‌కు తెలియ‌కుండా రూ.344 కోట్లు విద్యుత్ పాత‌బ‌కాయిల పేరుతో తీసుకోవ‌డం స‌ర్కారు గూండాగిరి కింద‌కే వ‌స్తుంది.

గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ‌బ‌ద్ధంగా ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్, మైనింగ్ సెస్, వృత్తి పన్ను, తలసరి గ్రాంట్, ఇసుకపై వ‌చ్చే ఆదాయాలు రూ.వేల కోట్లు ఎగ‌వేసింది. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులనూ వాడేయ‌డం చాలా దుర్మార్గమైన చ‌ర్య. సీఎం జగన్‌ రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో, గ్రామానికి స‌ర్పంచ్ కూడా అంతే. అటువంటి స‌ర్పంచులను ఆట‌బొమ్మల్ని చేసి, పంచాయ‌తీల నిధులు దారిదోపిడీ దొంగ‌ల్లాగా ప్రభుత్వమే మాయం చేయ‌డం చాలా అన్యాయం. గ్రామాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం స‌హ‌క‌రించాలి. పంచాయ‌తీ వ్యవ‌స్థని నిర్వీర్యం చేసే రాజ్యాంగేత‌ర చ‌ర్యలు మానుకోవాలి. ప‌ల్లెల్లో దిగజారిన ప‌రిస్థితులు చక్కదిద్దేందుకు మళ్లించిన నిధులు, ఎగ్గొట్టిన బకాయిలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి’’ అని లేఖలో లోకేశ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని