Ap News: కేవలం రూ.250 కోట్ల కోసం ప్రభుత్వానికి ఎందుకంత ఆత్రుత: పవన్‌ కల్యాణ్‌ 

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం వాటి నిధులను మళ్లించడం దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌..

Updated : 15 Nov 2021 12:25 IST

అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం వాటి నిధులను మళ్లించడం దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి తలమానికమైన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధులను ప్రభుత్వ అవసరాలకు తీసుకోవడానికి విశ్వవిద్యాలయం పాలక మండలిపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలన్నారు. వైద్యవిద్య ప్రమాణాలు మెరుగుపర్చేందుకు మరిన్ని నిధులు సమకూర్చాల్సిన పాలకులు ఉన్న నిధులను లాక్కోవాలని చూడటాన్ని విద్యావేత్తలు, వైద్య నిపుణులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు.

‘‘హెల్త్ యూనివర్సిటీ దగ్గర మిగులు నిధులుగా రూ.450 కోట్లు ఉన్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణా వాటా కింద రూ. 170 కోట్లు వెళ్లిపోతాయి. ఉన్నవాటిలో నుంచి ఏపీ ప్రభుత్వం రూ.250 కోట్లు మళ్లిస్తే ఇక మిగిలేది రూ. 30 కోట్లే. వీటితో విశ్వవిద్యాలయాలు ఏం సాధిస్తాయి? నిధులు మళ్లించాలని కీలక బాధ్యతల్లో ఉన్నవారే ప్రయత్నిస్తున్నారని.. అందుకే అత్యవసరంగా పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసినట్లు నా దృష్టికి వచ్చింది. కేవలం రూ.250 కోట్ల కోసం ప్రభుత్వం ఎందుకంత ఆత్రుత పడుతుందో అర్థం కావడం లేదు. ఈ నిధులను ఏ ప్రయోజనం కోసం ఖర్చు చేయాలనుకుంటున్నారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక స్థితి వల్లే అందరికీ ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతోపాటు రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలకు ఉన్న నిధులు, వాటి నిర్వహణపై జనసేన పార్టీ పరిశీలన చేస్తుంది. నిధుల మళ్లింపులో నిబంధనలు అనుసరించారా? లేదా? అనే విషయాలనూ సమగ్రంగా పరిశీలించాలని పార్టీ నాయకులకు ఇప్పటికే సూచించాను’’ అని పవన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని