Priyanka Gandhi: మరోసారి చీపురు పట్టి.. సీఎంకు కౌంటర్ ఇచ్చిన ప్రియాంక

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో లఖింపుర్‌ ఖేరి ఘటనతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి

Published : 09 Oct 2021 13:27 IST

లఖ్‌నవూ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో లఖింపుర్‌ ఖేరి ఘటనతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన విమర్శలను తిప్పికొడుతూ.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మరోసారి చీపురుపట్టి ఆయనకు కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..

గత ఆదివారం లఖింపుర్ ఖేరిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి తనయుడికి చెందిన వాహన శ్రేణి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఆ క్రమంలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకను యూపీ పోలీసులు సీతాపూర్ గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధించారు. ఆ సమయంలో ఆమె చీపురు పట్టి, తన గదిని శుభ్రం చేసుకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు ఆ పనులే సరిపోతాయనే అర్థం వచ్చేలా యోగి ఆదిత్యనాథ్ నిన్న విమర్శలు చేయడం కొత్త వివాదానికి తెరతీసింది. వాటికి కౌంటర్ ఇస్తూ.. ప్రియాంక లఖ్‌నవూలోని ఓ దళిత వాడలో ఆకస్మికంగా పర్యటించి, అక్కడ చీపురు పట్టి శుభ్రం చేశారు. దాన్నొక ఆత్మగౌరవ చర్యగా అభివర్ణించారు. అలాగే పార్టీలోని అన్ని జిల్లా కమిటీలు శనివారం వాల్మీకి దేవాలయాలను శుభ్రం చేస్తాయని ట్వీట్ చేశారు. 

అనంతరం యోగి విమర్శలపై ఆమె మాట్లాడుతూ.. ‘ఆయన(సీఎంను ఉద్దేశిస్తూ) ఆ మాటల ద్వారా నన్ను ఒక్కరినే అవమానించలేదు. ఈ పని చేసే కార్మికులందరినీ అవమానించారు. మీతో పాటు నేను కూడా ఈ పనిచేసేందుకు ఇక్కడకు వచ్చాను. పరిసరాలను శుభ్రం చేయడం, చీపురు పట్టడం ఆత్మగౌరవ చర్య అని తెలియజేయడానికి ఇక్కడకు వచ్చాను’ అని పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఢీ కొట్టి, పునర్వైభవాన్ని సంపాందించుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. లఖింపుర్ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. అయితే ఈ ఘటన ద్వారా విపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని భాజపా మండిపడుతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని