Revanth Reddy: కేసీఆర్‌ జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయాలి: రేవంత్‌

ధాన్యం కొనుగోళ్లపై తెరాస, భాజపా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 24 Sep 2022 15:07 IST

హైదరాబాద్‌:  ధాన్యం కొనుగోళ్లపై తెరాస, భాజపా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలని ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని.. వాయిదా వేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు రాజకీయ నేతల అవతారం ఎత్తారని ఆక్షేపించారు. 

తెరాస ధర్నాలకు అనుమతులిస్తున్నారని.. తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిబంధనలు కాంగ్రెస్‌కేనా.. తెరాస, భాజపాలకు వర్తించవా? అని రేవంత్‌ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తెరాస చేపట్టిన ధర్నాలో సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు.  రైతుల కోసం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆయన ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు. ధనిక రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయలేదా? ధాన్యం కొనని పార్టీలకు ఓటెందుకు వేయాలని రేవంత్‌ ప్రశ్నించారు. ప్రత్యేక బడ్జెట్‌ పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

హుజూరాబాద్‌పై అర్థవంతమైన సమీక్ష జరిగింది: భట్టి

అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ దేశం ఇంత బలంగా నిర్మాణం అవడానికి జవహర్‌లాల్‌ నెహ్రూ వేసిన పునాదులే కారణమన్నారు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ నెహ్రూకు నివాళులర్పించాలని కోరారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం దేశ స్వాతంత్ర్యంలో ఎలాంటి సంబంధం లేనివారిని ఉద్యమకారులుగా చెబుతున్నారని ఆక్షేపించారు.  1947 స్వాతంత్ర్య పోరాటాన్ని అవమాన పరచడం దారుణమన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసేవారు దేశద్రోహులని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా అమ్మేస్తోందని భట్టి విమర్శించారు. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరముందన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికపై దిల్లీలో అర్థవంతమైన సమీక్ష జరిగిందని భట్టి చెప్పారు. ఈ విషయంలో వచ్చి ఏ వార్త కూడా నిజం కాదన్నారు. ఈ సమీక్షపై మీడియాకు తాము చెప్పిందే వాస్తవన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని