RS Praveen kumar: సీఎం రేపే అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపే అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలి..

Published : 27 Aug 2021 01:38 IST

కరీంనగర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపే అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన బీఎస్పీ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని పేర్కొన్నారు. బూతులు మాట్లాడేవాళ్లకు వర్సిటీలు ఇస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌కు బుద్ధి చెప్పేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హుజూరాబాద్‌ డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. ఈ డ్రామాలో భాజపా కూడా అద్భుతంగా నటిస్తోందని ప్రవీణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

భాజపాకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్ చేశారు. తెరాసతో లోపాయకారి ఒప్పందం చేసుకున్న భాజపా.. మొన్న దుబ్బాకలో.. ఇవాళ హుజూరాబాద్‌లో డ్రామా ఆడుతోందని విమర్శించారు. తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటివరకు 18 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నిరుద్యోగులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని ప్రవీణ్‌కుమార్‌ కోరారు. ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు వస్తాయా?జోనల్‌ నిబంధనలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మూడేళ్లు పడుతుందా? అని ప్రశ్నించారు. బహుజన రాజ్యంలో బడుగులే పాలకులవుతారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని