UP Elections: విద్యార్థినులకు ఉచిత స్కూటీ, స్మార్ట్‌ఫోన్‌!

రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున 40శాతం మహిళకే సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ, తాజాగా అక్కడి విద్యార్థినులకు స్కూటీలు, స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తామని ప్రకటించింది.

Updated : 22 Oct 2021 04:43 IST

ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తున్నట్లు ప్రకటించిన ప్రియాంకా గాంధీ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అక్కడి యువతులు, మహిళలనే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున 40శాతం మహిళకే సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ, తాజాగా అక్కడి విద్యార్థినులకు స్కూటీలు, స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తామని ప్రకటించింది. వీటిని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపింది.

‘నిన్న కొంతమంది విద్యార్థినులను కలిశాను. వారు చదువుకోవడానికి, భద్రతకు స్మార్ట్‌ఫోన్లు అవసరమని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్‌ పాసైన విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు అందించాలని యూపీ కాంగ్రెస్‌ నిర్ణయించింది. వీటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం సంతోషంగా ఉంది’ అని కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనతో మాట్లాడిన తర్వాత విద్యార్థినుల స్పందనకు సంబంధించిన వీడియోను ప్రియాంకా గాంధీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ప్రియాంకా గాంధీని కలిసినపుడు ఎవరిదగ్గరైనా సెల్‌ఫోన్‌ ఉంటే సెల్ఫీ తీసుకోవచ్చని అడిగారు. కానీ, మా దగ్గర సెల్‌ఫోన్లు లేవని, వాటిని కాలేజీలో అనుమతించరని ఆమెతో చెప్పాం. అమ్మాయిలకు ఫోన్‌లు ఉండాలని.. వాటిని ఇచ్చేందుకు త్వరలోనే పథకాన్ని ప్రకటిస్తామని చెప్పారు. దాంతో మా భద్రత కోసం అంతకన్నా ఇంకా ఏం కావాలని బదులిచ్చాం’ అని యూపీ విద్యార్థినులు మీడియాతో వెల్లడించారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. కష్టపడి చదవాలని ప్రియాంకా గాంధీ మాతో చెప్పారు. ఇదే విధంగా మాతో కలవడం, మాట్లాడడం..తదితర కార్యక్రమాలను ప్రియాంకా గాంధీ మున్ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నానని సదరు విద్యార్థిని అభిప్రాయపడింది.

ఇదిలాఉంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా రంగంలోకి దిగారు. ఓవైపు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే అక్కడ రైతులు చేస్తోన్న ఆందోళన కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో మహిళలకు 40శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వస్తే విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, స్కూటీలను ఉచితంగా పంపిణీ చేస్తామని తాజాగా ప్రియాంకా గాంధీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని