Amarinder Singh: రేవంత్‌ రెడ్డి RSS నుంచి కాకపోతే ఎక్కడ నుంచి వచ్చారు?

దాదాపు 40ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తాజాగా ఆ పార్టీ తీరుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

Published : 22 Oct 2021 01:44 IST

లౌకికవాదం గురించి కాంగ్రెస్‌ మాట్లాడడం విడ్డూరం - కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌

దిల్లీ: దాదాపు 40 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ (Amarinder Singh) తాజాగా ఆ పార్టీ తీరుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కొంతకాలంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా లౌకికవాదం గురించి కాంగ్రెస్‌ మాట్లాడడం మానేయాలని హితవు పలికారు. మహారాష్ట్రలో శివసేనతో జట్టుకట్టడాన్ని, భాజపాతోపాటు, ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలున్న ఎంతో మంది నాయకులను కాంగ్రెస్‌ చేర్చుకోవడాన్ని ఎత్తిచూపారు. ప్రస్తుతం పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉన్న నవజోత్‌ సింగ్‌ సిద్ధూతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధినేతల గత రాజకీయ చరిత్రను ఉదహరించారు. త్వరలోనే కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించిన అమరీందర్‌ సింగ్‌.. భాజపాతోనూ పొత్తుకు సిద్ధమేనని సంకేతాలు ఇవ్వడంతో ఆయనపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే సెక్యులర్‌ గురించి మాట్లాడడం మానుకోవాలని కాంగ్రెస్‌ పార్టీకి అమరీందర్‌ సింగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కాకుంటే మరెక్కడ నుంచి..?

పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జిగా ఉన్న హరీష్‌ రావత్‌ ఈమధ్య చేసిన వ్యాఖ్యలను అమరీందర్‌ ప్రధానంగా ప్రస్తావించారు. సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల సమయంలో భాజపాతోనూ పొత్తకు సిద్ధమేనని అమరీందర్‌ సింగ్‌ పేర్కొనడం ఆయనలో ఉన్న లౌకికవాదిని చంపుకొన్నట్లేనని హరీష్‌ రావత్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ప్రతిస్పందించిన అమరీందర్‌ సింగ్‌.. ‘లౌకికవాదం గురించి కాంగ్రెస్‌ పార్టీ మాట్లాడడం మానుకోవాలి. 14 ఏళ్లపాటు భాజపాలో ఉన్న నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని మరవొద్దు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కాకపోతే నానా పటోల్‌ (మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌), రేవంత్‌ రెడ్డి (తెలంగాణ పీసీసీసీ చీఫ్‌) ఎక్కడ నుంచి వచ్చారు. అకాలీదళ్‌లో నాలుగేళ్ల పాటు ఉన్న పర్గత్‌ సింగ్‌ (ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే) కాంగ్రెస్‌లో చేరిన విషయాలు గుర్తులేవా’ అని అమరీందర్‌ సింగ్‌ తరపున ఆయన మీడియా సలహాదారు రవీన్‌ థుక్రాల్‌ ట్విటర్‌లో వరుస ప్రశ్నలు గుప్పించారు.

రాజకీయ అవకాశవాదం కాదా..?

‘మహారాష్ట్రలో శివసేనతో కలిసి ఏం చేస్తున్నారు?. కాంగ్రెస్‌ పార్టీకి ప్రయోజనం చేకూర్చేంత వరకూ మతతత్వ పార్టీలుగా పిలవబడే వారితో జట్టుకట్టడం సరైందేనని మీరు చెబుతున్నారా హరీష్‌ రావత్‌ జీ..? ఇది పూర్తిగా రాజకీయ అవకాశవాదం కాకపోతే మరేంటి..?’ అని అమరీందర్ సింగ్‌ ప్రశ్నించారు. అంతేకాకుండా నా ప్రత్యర్థులుగా ఉన్న అకాలీదళ్‌కు సహాయం చేస్తున్నానని నాపై ఆరోపణలు చేస్తున్నారు. గత పదేళ్లుగా కోర్టు కేసుల్లో వారిపై ఎందుకు పోరాడుతున్నానని అనుకుంటున్నారు..? మరి 2017 నుంచి పంజాబ్‌లో జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తున్నాను కదా? అని అమరీందర్‌ సింగ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ ప్రయోజనాలను నేను దెబ్బతీస్తున్నానని మీరు భావిస్తున్నారు. కానీ, వాస్తవం ఏమంటే.. నాపై విశ్వాసం లేకుండా నవజోత్‌ సింగ్‌ చేతిలో పార్టీ పగ్గాలు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ స్వతహాగా ప్రయోజనాలు కోల్పోతోంది’ అని అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని