Chandrababu: అప్పుడు పెట్రో ధరలు తగ్గిస్తానన్న జగన్‌ ఇప్పుడేం చెబుతారు?: చంద్రబాబు

అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని జగన్‌ గతంలో చెప్పారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దేశంలోని

Updated : 06 Nov 2021 22:15 IST

అమరావతి: అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని సీఎం జగన్‌ గతంలో చెప్పారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని.. ఏపీలో ఆ పరిస్థితి కనిపించలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కన్నా రాష్ట్రంలోనే అత్యధికంగా ధరలు ఉన్నాయని చెప్పారు. పెట్రో ధరలు ఎందుకు తగ్గించట్లేదని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేశారని తెలిపారు. ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

‘‘జగన్‌ది తుగ్లక్‌ పాలన కాక మరేమిటి? అధికారం చేతుల్లో ఉందని ధరలతో ప్రజలను బాదుతారా? పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది. ధరలు పెరగడం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారు. రాష్ట్రంలో పెట్రో ధరలు తగ్గించేవరకు తెదేపా పోరాటం చేస్తుంది. ఈనెల 9న మధ్యాహ్నం 12నుంచి ఒంటిగంట వరకు పెట్రోల్‌ బంకుల వద్ద ఆందోళనలు చేపడతాం. రాష్ట్రంలో పెట్రో ధరలు కనీసం రూ.16 వరకు తగ్గించి తీరాలి. ప్రజలంతా చైతన్యవంతులై జగన్‌ అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలి. 

కాజా టోల్‌గేట్‌ వద్ద పట్టుబడిన గంజాయిపై డీజీపీ సమాధానమేంటి? గంజాయి మొత్తం మార్కెట్‌లోకి వస్తే పరిస్థితేంటి?ఇంత జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నారు? రెండున్నరేళ్లలో జగన్‌ చేసింది విధ్వంసం, పన్నుల బాదుడు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, కేసులతో వేధిస్తున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. అధికారం ఉందంటే కుదరదు.. ప్రజలు తిరగబడితే పారిపోతారు. ద్రవిడ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా?నిబంధనలు అతిక్రమించిన అధికారులను వదిలిపెట్టం’’ అని చంద్రబాబు హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని