AP News: నడిరోడ్డుపై అయ్యన్న పాత్రుడు ధర్నా.. నర్సీపట్నంలో ఉద్రిక్తత

విశాఖజిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో

Updated : 24 Nov 2021 16:08 IST

నర్సీపట్నం: విశాఖజిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఆందోళన చేపట్టారు.  మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌నేత  అయ్యన్న పాత్రుడు నివాసం నుంచి  పోలీస్‌ స్టేషన్‌ వరకు  ప్రదర్శనగా వెళ్లి ఫిర్యాదు చేయాలని  తెదేపా శ్రేణులు నిర్ణయించారు.  ర్యాలీకి అనుమతించని పోలీసులు మార్గ మధ్యలోనే తెదేపా శ్రేణులను అడ్డుకున్నారు.  పోలీసు వలయాన్ని దాటుకుని అయ్యన్నపాత్రుడు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపైనే ధర్నాకు దిగారు. ఈక్రమంలో పోలీసులు, తెదేపా శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.  ఈ సందర్భంగా పలువురు మహిళా కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.  ఎంతసేపైనా సరే రోడ్డుపైనే బైఠాయించి.. పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లి ఫిర్యాదు చేసి తీరుతామని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్యకర్తలపై  పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమన్నారు. పోలీసుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు పరిసర గ్రామాల నుంచి  వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. నర్సీపట్నంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు అయ్యన్నకు మద్దతుగా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తో పాటు, పలువురు సీనియర్‌ నేతలు  ఆందోళనలో పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని