
TS News: తెరాస కనుసన్నల్లోనే ఎన్నికల ప్రక్రియ: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి తెరాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఐఏఎస్‌గా ఉన్నప్పుడు అక్రమాలు చేశారని కాంగ్రెస్ నేతలు రిటర్నింగ్ అధికారికి వివరించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఆన్‌లైన్‌లో ఉంచాలి. ఇంకా పత్రాలను ఎందుకు ఆన్‌లైన్‌లో పెట్టలేదు? తెరాస అభ్యర్థులపై ఉన్న కేసులను ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా తెరాస కనుసన్నల్లోనే నడుస్తోంది. మా అభ్యంతరాలపై ఎన్నికల అధికారులు స్పందించట్లేదు. అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.
వెంకట్రామిరెడ్డి విషయంలో సర్వీసు నిబంధనలు పాటించలేదు. ఆయనపై ఉన్న ఆరోపణలు తేలిన తర్వాతే రాజీనామాను ఆమోదించాలి. వెంకట్రామిరెడ్డి నామినేషన్ పత్రాలను ఆన్‌లైన్‌లో బహిర్గతం చేయాలి. వెంకట్రామిరెడ్డిపై ఆరు కేసులు ఉన్నాయి, ఒక కేసులో జరిమానా విధించారు. ఒక్క కేసు కూడా లేనట్లు వెంకట్రామిరెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
అధికార వ్యవస్థకే అవమానం తెచ్చేలా..
‘‘వెంకట్రామిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్‌గా ఉండి అధికార పార్టీకి అనుకూలంగా పని చేశారు. వెంకట్రామిరెడ్డిపై ఇప్పటికీ పలు కేసులు ఉన్నాయి. మండలి ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి పిటిషన్‌ను తిరస్కరించాలి. అధికార వ్యవస్థకే అవమానం తెచ్చేలా వెంకట్రామిరెడ్డి వ్యవహరించారు’’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.