TRS: తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెరాస ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.  శాసన మండలి

Updated : 09 Aug 2022 12:05 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెరాస ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించడంతో పేర్లను ప్రకటించారు. శాసన మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బండ ప్రకాశ్‌, కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావులకు అభ్యర్థులుగా అవకాశం కల్పించారు. తెరాస అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ ఆరుస్థానాల్లోనూ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

అనూహ్యంగా బండ ప్రకాశ్‌కు..

సునాయాసంగా గెలిచే వీలుండటంతో ఎమ్మెల్సీ పదవుల కోసం తెరాసలో తీవ్రమైన పోటీ నెలకొంది. సోమవారం ఉదయం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మధుసూదనాచారి, మరికొందరు ఆశావహుల పేర్లపై సీఎం కేసీఆర్‌ సహా తెరాస ముఖ్యనేతలు సుదీర్ఘ మంతనాలు జరిపారు. సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని భావించినప్పటికీ చివరికి ఎమ్మెల్యే కోటా కిందే ఆయన్ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కేబినెట్‌ విస్తరణలో బండ ప్రకాశ్‌కు చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెరాస వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బండ ప్రకాశ్‌ స్థానంలో రాజ్యసభకు కల్వకుంట్ల కవితను పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీకి కౌశిక్‌ రెడ్డి పేరును ప్రతిపాదించారు. తాజాగా ఆయన్ను ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేయడంతో గవర్నర్‌ కోటాకు కొత్త పేరును సీఎం కేసీఆర్ సూచించనున్నారు. 

పోటీ తీవ్రంగా ఉన్నందున ఆరు స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై గులాబీ పార్టీ అధిష్ఠానం ఆచితూచి కసరత్తు చేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక పూర్తిచేసింది. నేడే నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు కావడంతో అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని