గోవాలో తృణమూల్‌ సభ్యుల కంటే.. హోర్డింగులే ఎక్కువ: కాంగ్రెస్‌

వచ్చే ఏడాది గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో ఆ పార్టీ సభ్యులకంటే హోర్డింగులే ఎక్కువ దర్శనమిస్తున్నాయంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిరీశ్‌ చోదంకర్‌ ఎద్దేవాచేశారు.

Published : 01 Nov 2021 01:19 IST

దిల్లీ: వచ్చే ఏడాది గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో ఆ పార్టీ సభ్యులకంటే హోర్డింగులే ఎక్కువ దర్శనమిస్తున్నాయంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిరీశ్‌ చోదంకర్‌ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌ ఓటును చీల్చేందుకు భాజపానే తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఇక్కడికి పంపించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కారణంగానే మోదీ శక్తిమంతులు అవుతున్నారంటూ గోవా పర్యటనలో నిన్న మమత కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గిరీశ్‌ చోదంకర్‌ ఇటు తృణమూల్‌పైనా, అటు ఆమ్‌ ఆద్మీ పార్టీపైనా విమర్శలు గుప్పించారు.

‘‘తృణమూల్‌ హోర్డింగుల్లో మమత, ఆప్‌ హోర్డింగుల్లో కేజ్రీవాలే కనిపిస్తున్నారు. ఇంతకీ గోవాలో వారు ఏం చేద్దామని? గోవా ప్రభుత్వాన్ని బెంగాల్‌ నుంచో, దిల్లీ నుంచో నడపాలని ఇక్కడి ప్రజలు కోరుకోవడం లేదు’’ అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిరీశ్‌ చోదంకర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఓట్లను చీల్చి భాజపాను లబ్ధి చేకూర్చాలన్న తృణమూల్‌ ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. ఎన్నికలకు మూడు నెలల ముందొచ్చి ఏదో చేస్తామంటే ప్రజలు విశ్వసించరని అన్నారు. గోవాలో ఆ పార్టీ సభ్యుల కంటే ఐప్యాక్‌ (ప్రశాంత్‌ కిశోర్‌ జట్టు) సభ్యులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం ఆప్‌ వల్ల సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే తృణమూల్‌ను భాజపా రంగంలోకి దింపిందని ఆరోపించారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

2017లో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లకు గానూ కాంగ్రెస్‌ 17 స్థానాల్లో గెలుపొందింది. భాజపా 13 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టడంలో చాకచక్యంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేనతో పాటు ఇక్కడి ప్రాంతీయ పార్టీలైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ, మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ బరిలో నిలవనున్నాయి. పొత్తులపై ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని