కాంగ్రెస్‌ నుంచి అది ఆశించడం అత్యాశే... ఒమర్‌ అబ్దుల్లా కామెంట్స్‌

భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందనుకోవడం అత్యాశే అవుతుందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా అన్నారు.

Updated : 23 Feb 2024 16:50 IST

శ్రీనగర్‌: భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందనుకోవడం అత్యాశే అవుతుందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ నేతలు కుమ్ములాటలో మునిగి తేలుతున్న సమయంలో ఆ పార్టీ నుంచి అలాంటివి ఆశించడం సరికాదంటూ దెప్పిపొడిచారు. కాంగ్రెస్‌ పార్టీ వేసే అడుగుల ప్రభావం ఎన్డీయేతర కూటమిలో ఉన్న ప్రతి పార్టీపైనా ఉంటుందన్నారు. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ రాజీనామా నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపై నడవాలని ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతుండంపై ఒమర్‌ ఈ విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

మరోవైపు అమరీందర్‌ రాజీనామా నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు తమదైన శైలిలో స్పందించారు. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కాంగ్రెస్‌లో చేరిన రోజే కెప్టెన్‌ రాజీనామా స్క్రిప్ట్ సిద్ధమైందని హరియాణా ఆరోగ్యమంత్రి అనిల్‌ విజ్‌ అన్నారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ సీఎంలను మార్చే పనిలో పడ్డాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ విమర్శించింది. మరోవైపు కెప్టెన్‌ రాజీనామా కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని, అదే సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి కలిసొస్తుందని విశ్లేషణలు వినవస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని