
Assembly polls: కాంగ్రెస్‌లో చేరిన భాజపా బహిష్కృత నేత హరక్ సింగ్
దెహ్రాదూన్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నేతలు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. భాజపా బహిష్కృత నేత, ఉత్తరాఖండ్ మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దెహ్రాదూన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్.. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ.. అమిత్‌షాకు సన్నిహితుడైన హరక్ సింగ్ కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా హరక్ సింగ్ మాట్లాడుతూ భాజపాపై విమర్శలు గుప్పించారు. ‘నా అవసరం తీరాక భాజపా నన్ను వదిలేసింది. అది నన్ను తీవ్రంగా బాధించింది. నేను ఏ తప్పూ చేయలేదు. అమిత్ షాతో చివరి వరకు స్నేహాన్ని కొనసాగించా’ అని పేర్కొన్నారు. మార్చి 10న కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నుంచి హరక్ సింగ్ రావత్‌ను తొలగించిన భాజపా.. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు రద్దు చేసింది. రావత్ మంత్రి పదవి తొలగింపుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గవర్నర్‌కు లేఖ రాశారు. అయితే ఈ ఎన్నికల్లో తన బంధువులకు టికెట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వంపై హరక్ ఒత్తిడి తెచ్చారని.. అందుకే ఆయన్ను భాజపా బహిష్కరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. హరక్ కోడలు అనుకృతి గుసైన్ రావత్‌కు లాన్స్‌డౌన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.