Aparna Yadav: ‘చిన్న కోడలు’.. పెద్ద మార్పు.. ఎవరీ అపర్ణాయాదవ్‌?

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ మరదలు అపర్ణ

Published : 20 Jan 2022 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections 2022)కు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ (Mulayam Singh Yadav) చిన్న కోడలు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) మరదలు అపర్ణా యాదవ్‌ (Aparna Yadav) బుధవారం భాజపా (BJP)లో చేరారు. అపర్ణ చేరికతో రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయనేది పక్కనబెడితే.. రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి.. ప్రత్యర్థి పార్టీ అయిన భాజపాలో చేరడమనేది ఎన్నికల వేళ పెద్ద మార్పే అని చెప్పాలి. ఇంతకీ ఎవరీ అపర్ణా యాదవ్‌ అంటే..!

గాయని, జంతు ప్రేమికురాలు..

ములాయం సింగ్‌ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ను అపర్ణ 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. మాజీ జర్నలిస్టు కుమార్తె అయిన అపర్ణ.. లఖ్‌నవూలో డిగ్రీ పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తితో యూకేలోని మాంచెస్టర్‌ యూనివర్శిటీ నుంచి ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ పాలిటిక్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. అపర్ణ క్లాసికల్‌ సింగర్‌. జంతు ప్రేమికురాలు కూడా. ‘బి అవేర్‌’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. జంతు సంరక్షణతో పాటు మహిళల భద్రతపైనా పనిచేస్తున్నారు.

ఐదేళ్ల కిందటే రాజకీయ అరంగేట్రం..

అపర్ణ భర్త ప్రతీక్‌ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించరు. సమాజ్‌వాదీ పార్టీ కార్యకలాపాలకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటారు. కానీ అపర్ణ రాజకీయాలంటే ఆసక్తితో 2017లోనే అరంగేట్రం చేశారు. ఆ ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున లఖ్‌నవూ కంటోన్మెంట్‌ స్థానం నుంచి పోటీ చేశారు. ములాయం కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 22వ వ్యక్తి ఈమె. అయితే ఆ ఎన్నికల్లో భాజపా నాయకురాలు రీటా బహుగుణ జోషి చేతిలో 34వేల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూశారు. తొలి ఎన్నికల్లోనే ఓటమిపాలైనా.. నిరాశ చెందకుండా రాజకీయ కార్యక్రమాల్లో క్రియాశీలకంగానే ఉంటున్నారు.

మోదీ, యోగిపై ప్రశంసలు..

అయితే, గత కొంతకాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై వివిధ సందర్భాల్లో అపర్ణ ప్రశంసలు కురిపించారు. NRC, ఆర్టికల్‌ 370 రద్దును సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకిస్తే.. అపర్ణ సమర్థించడం గమనార్హం. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆమె రూ.11లక్షల విరాళంగా ఇచ్చారు. యోగి ప్రభుత్వం ఆమెకు వై కేటగిరి భద్రత కూడా కల్పించింది. ఈ క్రమంలోనే ఆమె భాజపాలో చేరనున్నట్లు ఆ మధ్య ప్రచారం జోరందుకుంది. అయితే ఈ వార్తలను అఖిలేశ్‌ గతంలో ఖండించారు. ఇది తమ కుటుంబ వ్యవహారమని చెప్పుకొచ్చారు. కానీ, ఆ ఊహాగానాలను నిజం చేస్తూ అపర్ణ బుధవారం భాజపాలో చేరారు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌..

అపర్ణ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సేవా కార్యక్రమాలు, చర్చా వేదికల్లో పాల్గొంటూ ఆ చిత్రాలను పోస్ట్‌ చేస్తుంటారు. ప్రతీక్‌ యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌ మధ్య కుటుంబపరంగా విభేదాలు ఉన్నప్పటికీ ములాయం కుటుంబంతో అపర్ణకు మంచి సాన్నిహిత్యం ఉంది. తరచూ కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను పంచుకుంటారు.

గత కొద్దిరోజులుగా కీలకమైన బీసీ నేతలు భాజపా నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో.. అపర్ణ చేరిక భాజపాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్‌ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏదేమైనా చోటీ బహు.. పెద్ద మార్పే తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని