Updated : 15/10/2020 16:57 IST

అవును, ఇది 2020.. అసలు ఊహించలేం!

కోహ్లీసేనలో ఈ మార్పులకు కారణాలేంటి?

లీగ్‌ ఆరంభానికి ముందు ప్రతిసారి.. ‘‘ఈ సాలా కప్ నమదే నినాదంతో బరిలోకి దిగడం..మెరుగ్గా రాణించి ట్రోఫీ సాధిస్తారునుకోవడం.. అంచనాలు అందుకోలేక చతికిలపడటం.. అభిమానులు నిరాశచెందడం..’’ గత సీజన్లలో కోహ్లీసేన పరిస్థితి ఇది. కానీ ఈ సీజన్‌లో మురిపిస్తోంది. ఆల్‌రౌండర్‌ షోతో మైమరిపిస్తోంది. అవును ఇది 2020 కదా! ఊహించినది జరగదని మరోసారి నిరూపిస్తోంది. గతంలో ఒకరిద్దరి ప్లేయర్ల మీద ఆధారపడిన జట్టు సమష్టి విజయాలు సాధిస్తోంది. ఒక్కప్పుడు బలహీనతగా మారిన ఆ జట్టు బౌలర్లే ఇప్పుడు మ్యాచ్‌ విజేతలు అవుతున్నారు. కోహ్లీసేనలో ఈ అనుహ్య మార్పులకు కారణాలేంటి?

2016లో రన్నరప్‌గా నిలిచింది. ఈ సారి టైటిల్ గెలవాలని 2017 సీజన్‌లో పట్టుదలతో బరిలోకి దిగింది. కానీ సీన్‌ కట్‌ చేస్తే.. పట్టికలో ఆఖరి స్థానం. కేవలం మూడే విజయాలు సాధించింది. తర్వాతి సీజన్‌లోనూ ఉత్సాహంతో బరిలోకి దిగింది. ఈ సారి ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్‌ రేసులో గట్టిపోటీనే ఇచ్చింది. కానీ కీలక మ్యాచ్‌లో తడబడి నిరాశపరిచింది. 2019 సీజన్‌లో మరోసారి ‘ఈ సారి కప్ మాదే’ అని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగినా.. అదే ఫలితం‌. 14 మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించి పట్టికలో చివరి స్థానం నిలిచింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ ఎంతో పోరాడుతున్నా జట్టును ప్లేఆఫ్‌కు చేర్చలేకపోయారు. అయితే సీజన్‌ ముగింపులో వారిద్దరు భావోద్వేగంతో మాట్లాడారు. ఎప్పటికీ బెంగళూరుతో ఉంటామని, అత్యంత శక్తివంతంగా తిరిగొస్తామని అభిమానులకు భరోసా ఇచ్చారు.

‘మళ్లీ అదే పొరపాటు..’ అన్నారు  
వ్యూహాలు మార్చిన యాజమాన్యం కోచ్‌గా సైమన్‌ కటిచ్‌ను ఎంపిక చేసింది. వేలంలో ఆల్‌రౌండర్‌ క్రిస్ మోరిస్‌ను రూ.10 కోట్లకు, ఆరోన్‌ ఫించ్‌ను రూ.4.40 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే బౌలింగ్‌లో బలహీనమైన బెంగళూరు.. వేలంలో నాణ్యమైన బౌలర్‌ను తీసుకోకుండా మరోసారి పొరపాటు చేసిందని విశ్లేషకులు విమర్శించారు. బ్యాటింగ్‌లో బలోపేతంగా ఉన్న జట్టులో మరో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌కు బదులుగా మంచి బౌలర్‌ను తీసుకోవాల్సిందని సలహాలు ఇచ్చారు. కానీ కోహ్లీసేన ప్రణాళిక భిన్నం. రూ.4 కోట్లకు కేన్‌ రిచర్డ్‌సన్‌ను, కనీస ధర రూ.50 లక్షలకు శ్రీలంక పేసర్‌ ఉదానను జట్టులోకి తీసుకుంది. కేన్‌ గైర్హాజరుతో యూఏఈ పిచ్‌లపై ప్రభావం చూపిస్తాడని స్పిన్నర్‌ జంపాను ఎంచుకుంది. వాళ్ల ఎంపికలు ఈ సీజన్‌లో విజయవంతమయ్యాయి.

కోహ్లీ-ఏబీ మాత్రమే కాదు..
గతంలో జట్టు భారమంతా కోహ్లీ, డివిలియర్సే మోసేవారు. కానీ ఈ సారి సమష్టి ప్రదర్శనతో రాణిస్తున్నారు. యువకెరటం దేవదత్ పడిక్కల్‌ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 34.71 సగటుతో పరుగులు సాధిస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఫించ్‌ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఆఖరి ఓవర్లలో దూకుడైన బ్యాటింగ్‌తో దూబె విలువైన పరుగులు సాధిస్తున్నాడు. కోహ్లీ, డివిలియర్స్‌ తమ పని చేసుకుపోతున్నారు. మునుపటిలా పరుగుల వరద పారిస్తున్నారు. అయితే ఇప్పటివరకు క్రిస్‌ మోరిస్, గుర్‌కీరత్ సింగ్‌కు బ్యాటింగ్ అవకాశం రాలేదు. గత సీజన్‌లో హైదరాబాద్‌పై గుర్‌కీరత్‌ ప్రదర్శన అభిమానులకి జ్ఞాపకమే.

‘పేస్+స్పిన్’‌ అదిరింది
అయితే బెంగళూరు జట్టులో ప్రధాన మార్పు బౌలింగ్. గతంలో చాలా మ్యాచ్‌లు భారీగా పరుగులు సమర్పించుకుని ఓటమిపాలయ్యారు. కానీ ఈ సారి సీన్ మారిపోయింది. తొలి మ్యాచ్‌ల్లో భారీగా పరుగులిచ్చిన ఉమేశ్‌ యాదవ్‌, స్టెయిన్‌ను తుదిజట్టు నుంచి తప్పించడంతో జట్టుకూర్పు కుదిరింది. స్టెయిన్‌ స్థానంలో వచ్చిన ఉదాన డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సైని పదునైన యార్కర్లతో బోల్తాకొట్టిస్తున్నాడు. ఇక ఆలస్యంగా వచ్చిన ఆల్‌రౌండర్‌ క్రిస్ మోరిస్ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సిరాజ్‌ తన వంతు సాయం చేస్తున్నాడు. కాగా, అన్ని జట్లతో పోలిస్తే బెంగళూరు స్పిన్‌ విభాగం భళారే అనిపిస్తోంది. వాషింగ్టన్‌ సుందర్‌.. పవర్‌ప్లేలోనే వికెట్లు తీస్తూ, తక్కువ ఎకానమీరేటుతో స్పెల్‌ను ముగిస్తున్నాడు. ఇక కీలక బ్యాట్స్‌మెన్‌ను చాహల్ తన మాయాజాలంతో మాయచేస్తున్నాడు. వీరిద్దరు కలిసి ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

కోహ్లీ-కటిచ్‌ వ్యూహాలతో..
కోచ్‌గా సైమన్‌ కటిచ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఉత్తమ ప్రదర్శన చేసేలా ఆటగాళ్లను ఉత్సాహపరుస్తున్నాడు. జూనియర్‌ ప్లేయర్ల‌ను దిశానిర్దేశం చేయాలని సీనియర్ల‌కు బాధ్యతలు అప్పగించడం, ఎక్కువగా యార్కర్లు వేసేలా ప్రాక్టీస్‌లో సరదాగా పోటీలు పెట్టడం చేస్తున్నాడు. దీంతో ఆటగాళ్ల ఆటతీరులో మార్పులు వస్తున్నాయి. అంతేగాక కోహ్లీతో చర్చిస్తూ ఉత్తమ తుదిజట్టును ఎంపిక చేస్తున్నాడు. ఇక కోహ్లీ బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ సత్తాచాటుతున్నాడు. ఆటగాళ్లపై విశ్వాసం ఉంచుతూ ఫలితాలు సాధిస్తున్నాడు. సుందర్‌ను పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయించడం, బ్యాట్స్‌మెన్‌ కుదురుకునే సమయంలో చాహల్‌ను ప్రయోగించడం, ఉదానకు మిడిల్‌ ఓవర్లలోనూ బంతిని అందివ్వడం చేస్తూ ప్రత్యర్థులను దెబ్బతీస్తున్నాడు.

ఒత్తిడిని ఎదుర్కొంటే..
అయితే బెంగళూరు ప్రదర్శన ఎప్పుడూ నిలకడగా లేదు. తమదైన రోజున ప్రత్యర్థులపై సింహనాదాలు చేసే ఆ జట్టు.. ఒత్తిడిలో మాత్రం చిత్తుగా ఓడిపోతుంటుంది. భారీ ఛేదనలో ఆదిలోనే వికెట్లు పడితే అంతే సంగతులు. బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు చేరుతుంటారు. ఈ సీజన్‌లో పంజాబ్‌ మ్యాచ్‌లో కోహ్లీసేన 109 పరుగులకే ఆలౌటై 97 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దిల్లీ మ్యాచ్‌లోనూ 59 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అయితే భారీ ఓటముల వల్ల బెంగళూరు నెట్‌ రన్‌రేటు తీవ్రంగా పడిపోతుంది. ప్లేఆఫ్‌ రేసులో నెట్‌ రన్‌రేటు ఎంత కీలకమే అందరికీ తెలిసిందే. అంతేగాక, బెంగళూరు ఆటగాళ్లు ఎక్కువగా క్యాచ్‌లను జారవిడుస్తున్నారు. కోహ్లీ సైతం రెండు క్యాచ్‌లను అందుకోవడంలో విఫలమయ్యాడు. లైటింగ్‌ ప్రభావంతో ఫీల్డింగ్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆటగాళ్లు చెబుతున్నా.. కీలక మ్యాచ్‌ల్లో క్యాచ్‌లు ఎంతో విలువైనవి. మెరుగైన ఫీల్డింగ్‌తో పాటు ఒత్తిడిని జయిస్తే ఈ సారి కోహ్లీసేన ట్రోఫీని ముద్దాడడం ఖాయమని విశ్లేషకుల అంచనా.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని