T20 World Cup: వారెవ్వా వార్నర్‌

తొలి టీ20 ప్రపంచకప్‌ గెలవాలన్న కసితో ఉన్న ఆస్ట్రేలియా ఆ దిశగా దూసుకెళ్తోంది. స్టార్‌ ఆటగాళ్లంతా రెచ్చిపోయి ఆడుతుండటంతో ఆ జట్టుకు ఎదురులేకుండా పోతోంది.

Updated : 07 Nov 2021 06:19 IST

సత్తా చాటిన డేవిడ్‌, హేజిల్‌వుడ్‌

విండీస్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం

అబుదాబి

తొలి టీ20 ప్రపంచకప్‌ గెలవాలన్న కసితో ఉన్న ఆస్ట్రేలియా ఆ దిశగా దూసుకెళ్తోంది. స్టార్‌ ఆటగాళ్లంతా రెచ్చిపోయి ఆడుతుండటంతో ఆ జట్టుకు ఎదురులేకుండా పోతోంది. సెమీఫైనల్‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన గ్రూప్‌-1 మ్యాచ్‌లో చెలరేగిన కంగారూల జట్టు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (89 నాటౌట్‌; 56 బంతుల్లో 9×4, 4×6) మెరుపులతో లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి అలవోకగా అందుకుంది. శనివారం మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. పొలార్డ్‌ (44; 31 బంతుల్లో 4×4, 1×6) టాప్‌ స్కోరర్‌. హేజిల్‌వుడ్‌ (4/39) ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

వార్నర్‌ ధనాధన్‌: ఛేదనలో ఆస్ట్రేలియా ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదంటే కారణం ఓపెనర్‌ డేవిడ్‌ వార్నరే. తన శైలిలో దంచేసిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ కరీబియన్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హోల్డర్‌ వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, సిక్స్‌తో మొదలైన అతడి జోరు ఆపై మరింత పెరిగింది. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుంటూ డేవిడ్‌ మోత మోగించాడు. కెప్టెన్‌ ఫించ్‌ (9) వెనుదిరిగినా.. మిచెల్‌ మార్ష్‌ (53; 32 బంతుల్లో 5×4, 2×6) అండతో వార్నర్‌ చెలరేగాడు. తన శైలిలో బలమైన పుల్‌, కట్‌ షాట్లే కాదు స్లాగ్‌ స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌లతో పరుగులు రాబట్టిన ఈ ఓపెనర్‌ ఎక్కడా రన్‌రేట్‌ తగ్గకుండా చూశాడు. ఈ క్రమంలో హోల్డర్‌, వాల్ష్‌ బౌలింగ్‌లో కొట్టిన సిక్సర్లు హైలైట్‌. మార్ష్‌ కూడా కొన్ని మెరుపు షాట్లు ఆడడంతో 10 ఓవర్లకు ఆసీస్‌ 98/1తో లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ఈ క్రమంలోనే 29 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్న వార్నర్‌.. ఆ తర్వాతా దూకుడు ప్రదర్శించాడు. 36 బంతుల్లో 25 పరుగులు అవసరమైన స్థితిలో బ్రావో బౌలింగ్‌లో వార్నర్‌ ఫోర్‌, సిక్స్‌ అందుకోవడంతో లక్ష్యం మరింత తేలికైపోయింది. చివర్లో మార్ష్‌ వెనుదిరిగినా ఛేజ్‌ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి వార్నర్‌ జట్టును గెలిపించాడు. ఆసీస్‌ మరో 22 బంతులు ఉండగానే విజయతీరాలకు చేరింది.

పొలార్డ్‌ ఒక్కడే: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు పొలార్డ్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. హేజిల్‌వుడ్‌, కమిన్స్‌ దెబ్బకు 35 పరుగులకే గేల్‌ (15), పూరన్‌ (4), ఛేజ్‌ (0) వికెట్లు కోల్పోయి విండీస్‌ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో లూయిస్‌ (29), హెట్‌మయర్‌ (27)తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించాడు. అయితే వికెట్‌ కోల్పోకూడదని ఇద్దరు జాగ్రత్తగా ఆడటంతో పరుగుల వేగం తగ్గింది. దీనికి తోడు లూయిస్‌ ఔట్‌ కావడంతో విండీస్‌ 74/4తో ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత హెట్‌మయర్‌ కూడా ఎక్కువసేపు నిలవలేదు. హేజిల్‌వుడ్‌ ఆ జట్టును దెబ్బ తీశాడు. పరుగులు రాక మందగించడంతో 15 ఓవర్లకు విండీస్‌ 99/5తో నిలిచింది. ఈ స్థితిలో పొలార్డ్‌.. బ్రావో (10)తో కలిసి గేర్లు మార్చి స్కోరు పెంచాడు. బ్రావో వెనుదిరిగినా.. తన షాట్లు ఆడిన పొలార్డ్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో వెనుదిరిగాడు. ఈ స్థితిలో విండీస్‌ స్కోరు 150 పరుగులు అందుకోవడం కష్టంగా అనిపించినా ఇన్నింగ్స్‌ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన రసెల్‌ (7 బంతుల్లో 18) విండీస్‌కు పోరాడే స్కోరు సాధించిపెట్టాడు.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ (బి) కమిన్స్‌ 15; లూయిస్‌ (సి) స్మిత్‌ (బి) జంపా 29; పూరన్‌ (సి) మిచెల్‌ మార్ష్‌ (బి) హేజిల్‌వుడ్‌ 4; ఛేజ్‌ (బి) హేజిల్‌వుడ్‌ 0; హెట్‌మయర్‌ (సి) వేడ్‌ (బి) హేజిల్‌వుడ్‌ 27; పొలార్డ్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) స్టార్క్‌ 44; డ్వేన్‌ బ్రావో (సి) వార్నర్‌ (బి) హేజిల్‌వుడ్‌ 10; రసెల్‌ నాటౌట్‌ 18; హోల్డర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157; వికెట్ల పతనం: 1-30, 2-35, 3-35, 4-70, 5-91, 6-126, 7-143; బౌలింగ్‌: మిచెల్‌ స్టార్క్‌ 4-0-33-1; హేజిల్‌వుడ్‌ 4-0-39-4; కమిన్స్‌ 4-0-37-1; మ్యాక్స్‌వెల్‌ 1-0-6-0; మిచెల్‌ మార్ష్‌ 3-0-16-0; ఆడమ్‌ జంపా 4-0-20-1

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ నాటౌట్‌ 89; ఫించ్‌ (బి) అకీల్‌ 9; మిచెల్‌ మార్ష్‌ (సి) హోల్డర్‌ (బి) గేల్‌ 53; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 161; వికెట్ల పతనం: 1-33, 2-157; బౌలింగ్‌: అకీల్‌ 4-0-29-1; ఛేజ్‌ 1.2-0-17-0; హోల్డర్‌ 2-0-26-0; బ్రావో 4-0-36-0; హేడెన్‌ వాల్ష్‌ 2-0-18-0; రసెల్‌ 2-0-25-0; గేల్‌ 1-0-7-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు