
స్టాయినిస్ మెరుపులు.. దిల్లీ భారీ స్కోరు
ఇంటర్నెట్‌డెస్క్: మార్కస్ స్టాయినిస్ (53*; 26 బంతుల్లో, 6×4, 2×6) అజేయ అర్ధశతకంతో చెలరేగిన వేళ.. బెంగళూరు ముందు దిల్లీ 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచి పృథ్వీ షా (42; 23 బంతుల్లో, 5×4, 2×6) బౌండరీల మోత మోగించడంతో దిల్లీకి శుభారంభం లభించింది. అతడికి తోడుగా శిఖర్ ధావన్ (32; 28 బంతుల్లో, 3×4) కూడా మెరవడంతో పవర్‌ప్లేలో ఆ జట్టు 63 పరుగులు చేసింది. అయితే 7వ ఓవర్‌లో షాను సిరాజ్ బోల్తా కొట్టించి పరుగుల జోరుకు బ్రేక్‌లు వేశాడు. కొద్దిసేపటికే ధావన్, శ్రేయస్ అయ్యర్ (11) కూడా ఔటవ్వడంతో స్కోరుబోర్డు నెమ్మదించింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్ (37; 25 బంతుల్లో, 3×4, 2×6), స్టాయినిస్ మరో వికెట్ పడకుండా నెమ్మదిగా ఆడటంతో 13వ ఓవర్‌లో ఆ జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. అనంతరం స్టాయినిస్ బౌండరీల మోత మోగించాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్.. సైని ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. పంత్ కూడా చెలరేగంతో పరుగులు పోటెత్తాయి. ఈ క్రమంలో స్టాయినిస్ 24 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆఖరి ఓవర్‌లో హెట్‌మెయిర్ (11*) సిక్సర్ బాదడంతో దిల్లీ 196 పరుగులు సాధించింది. గత సీజన్‌లో స్టాయినిస్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సైని విఫలమయ్యాడు. 3 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు.
Advertisement