నెట్‌బౌలర్‌ నుంచి టీమ్‌ఇండియా పేసర్‌గా..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫాస్ట్‌ బౌలర్‌ టి.నటరాజన్‌.. నెట్‌బౌలర్‌ నుంచి టీమ్‌ఇండియా పేసర్‌గా ఎదిగాడని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసించాడు...

Updated : 10 Dec 2020 15:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫాస్ట్‌ బౌలర్‌ టి.నటరాజన్‌.. నెట్‌బౌలర్‌ నుంచి టీమ్‌ఇండియా పేసర్‌ స్థాయికి ఎదిగాడని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో నటరాజన్‌ ఆరు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌ పేసర్‌ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. మూడో టీ20 అనంతరం వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో నటరాజన్‌ను పొగుడుతూ ఓ పోస్టు చేశాడు. ఐపీఎల్లో తన సహచర ఆటగాడైన నటరాజన్‌.. భారత్‌-ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొట్టాడని, నెట్‌ బౌలర్‌గా ఈ  పర్యటనకు ఎంపికై తర్వాత భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడని సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ మెచ్చుకున్నాడు.

క్రికెట్‌లో గెలుపోటములు పక్కనపెడితే టీమ్‌ఇండియా-ఆస్ట్రేలియా ఆటగాళ్లు పరస్పరం గౌరవించుకొంటారని వార్నర్‌ పేర్కొన్నాడు. తాము టీ20 సిరీస్‌ కోల్పోయినా నటరాజన్‌ ప్రదర్శన పట్ల ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. నటరాజన్‌ మంచి ఆటగాడని, ఈ సిరీస్‌ను ఆస్వాదించానని సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ వివరించాడు. ఇదిలా ఉండగా.. నటరాజన్‌ తొలుత ఈ ఆస్ట్రేలియా పర్యటనకు నిజంగానే నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే, టీమ్‌ఇండియా తొలి రెండు వన్డేల్లో అనూహ్యంగా ఓటమిపాలవ్వడంతో మూడో వన్డేలో నటరాజన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. అప్పుడతడు ఫర్వాలేదనిపించడంతో తర్వాత టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు, రెండో మ్యాచ్‌లో రెండు, మూడో మ్యాచ్‌లో ఒక వికెట్‌ పడగొట్టాడు. మరోవైపు యూఏఈలో గతనెల పూర్తి అయిన 13వ సీజన్‌లోనూ మంచి ప్రదర్శనే చేశాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ తరఫున రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. 

ఇవీ చదవండి..

ధోనీకి యువీలా.. హార్దిక్‌కు మరొకరు అవసరం

గంగూలీ, షా కొనసాగింపుపై ఉత్కంఠ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని