Updated : 16/08/2020 15:42 IST

అవును.. ధోనీ రియల్‌ సూపర్ హీరో!

ఉద్యోగంలో కొనసాగాలా? క్రికెట్ కోసం పరుగెత్తాలా? అనే ప్రశ్నలను అతడ్ని ఎంతో వేధించాయి. ఊహ తెలిసినప్పటి నుంచి ఇష్టపడిన క్రికెట్ వైపే అతని పాదం కదిలింది. జులపాల జుట్టుతో వికెట్‌కీపర్‌గా భారత జట్టులో అడుగుపెట్టాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. పరిమితంగా వస్తున్న అవకాశాల కోసం ఎంతో ఎదురు చూశాడు. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. అంతే.. యావత్‌ భారత్‌ ఒక్కసారిగా అతడి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. అతడు ఎవరో కాదు. భారత్ క్రికెట్‌ ముఖచిత్రాన్ని మార్చిన మహేంద్ర సింగ్ ధోనీ. క్రికెట్‌లో అపర చాణక్యుడిగా ఎన్నో ఘనతలు సాధించిన ధోని అంతర్జాతీయ ఆటకు శనివారం వీడ్కోలు పలికాడు. 

2005లో  ధోనీ పాకిస్థాన్‌పై 148 పరుగులు, శ్రీలంకపై 183* పరుగులు చేసిన ఇన్నింగ్స్‌లను క్రికెట్‌ అభిమానులు ఎన్నటికీ మరవలేరు. అలాంటి ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత 2007 టీ20 ప్రపంచకప్‌ సారథిగా ధోనీకి బాధ్యతలు అప్పగించారు. అందివచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. తొలి టీ20 ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ను నిలబెట్టాడు. దీంతో అతడి అభిమానుల సంఖ్య తారాస్థాయికి పెరిగింది. అతడిలానే యువత హెయిర్‌ కట్‌ను అనుకరిస్తూ ధోనీని ఆరాధించారు. తర్వాత భారత్‌ జట్టుకు సంపూర్ణ సారథిగా మారాడు. అతిరథ మహారథులకు సాధ్యం కానీ ఎన్నో రికార్డులను సాధించాడు. 2009లో టెస్టుల్లో జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాడు. 28 ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత అభిమానుల ప్రపంచకప్ కలను సాకారం చేశాడు. అంతేకాకుండా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అందుకున్నాడు. భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యయనాన్ని నెలకొల్పాడు. 

అపర చాణుక్యుడు..!

ఇలా భారత క్రికెట్‌కు ఎన్నో మధురానుభూతులను అందించిన ధోనీకి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. క్రికెట్‌ ప్రపంచంలో ఎవరీకి సాధ్యం కానీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అందుకున్నాడు ధోనీ. భారత జట్టులోని సభ్యులే కాదు, ప్రత్యర్థులు కూడా అతడికి  అభిమానులే. అంతలా అభిమానాన్ని చూరకొనడానికి అతడి నడవడికే కారణం. నరాలు తెగే ఉత్కంఠ, ఒత్తిడిలోనూ అతడు చాలా ప్రశాంతగా ఉంటాడు. జట్టులో ఉన్న వనరులను ఎలా ఉపయోగించాలో అతడికే బాగా తెలుసు. ఏ ఆటగాడు ఎలా ఆడతాడు? అతడ్ని ఎలా బురిడి కొట్టించాలో ముందుగానే అతను పసిగట్టేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రికెట్‌లో అతడో అపర చాణుక్యుడు. అంతేకాకుండా ధోనీ రివ్యూ వెళ్తే కచ్చితంగా ఆ ఫలితం అంపైర్‌కు వ్యతిరేకంగా వస్తుందనడంలో అతియోశక్తి లేదు. అలా వచ్చిన సందర్భాలు కోకొల్లాలు. అందుకే అతడి అభిమానులు డీఆర్‌ఎస్‌ను ధోనీ రివ్యూ సిస్టమ్‌గా పిలుచుకుంటారు. 

ఎక్కడైనా అదే అభిమానం

అభిమానుల నుంచి ధోనీ ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాడు. ధోనీని తాకాలని వారు మ్యాచ్‌ మధ్యలో మైదానంలోకి దూసుకొస్తుంటారు. కేవలం భారత్‌లోనే కాదు ఇతర దేశాల్లోనే ఇదే పరిస్థితి. అలా ఒక అభిమాని జాతీయ జెండాతో మైదానంలోకి వచ్చాడు. అభిమాని ధోనీ కాళ్లను తాకే క్రమంలో జాతీయ జెండా నేలను తాకబోతుండటాన్ని గమనించి రెప్పపాటులో త్రివర్ణ పతాకాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. టెరిటోరియల్‌ ఆర్మీ ప్యారాచూట్‌ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌ కల్నల్‌ అయిన ధోనీ ఇలా తన దేశభక్తిని ఎన్నో సందర్భాల్లో చూపించాడు. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను దేశభక్తితో బలిదాన్‌ గుర్తుతో గ్లోవ్స్‌ను ధరించాడు. కానీ ఐసీసీ గ్లోవ్స్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని బీసీసీఐని కోరింది. అప్పుడప్పుడూ నేలపై పెట్టాల్సి వస్తుందని కీపింగ్‌ హెల్మెట్‌పై జాతీయ జెండా చిహ్నాన్ని అతడు ఉంచుకోడు. అంతేకాకుండా పద్మభూషణ్‌ను సైనికుడి దుస్తుల్లోనే అందుకున్నాడు. దేశంపై తన భక్తిని ఎన్నో సందర్భాల్లో చూపించిన ధోనీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిటైర్మెంట్‌ ప్రకటించడం విశేషం.

సినిమాల్లో హీరోలు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంటారు. ఇక  మార్‌వెల్స్‌ సూపర్‌ హీరోలు అయితే ఎన్నో విన్యాసాలు చేస్తుంటారు. కానీ ధోనీ నిజమైన సూపర్ హీరో. మైదానంలో ఎవరికీ సాధ్యం కాని ప్రదర్శన చేస్తాడు. రెప్పపాటులో వికెట్లను గిరాటేయడం, రనౌట్‌ చేసే సమయంలో వికెట్లను చూడకుండానే బ్యాట్స్‌మెన్‌ను బోల్తాకొట్టించడంలో అతడు సిద్ధహస్తుడు. అంతేకాదు ఆఖరి ఓవర్‌లో 30 పరుగులు చేయాలన్నా ధోనీ క్రీజులో ఉంటే ఒత్తిడి బౌలర్‌పైనే ఉంటుంది. అంతలా ఉంటుంది అతడి విధ్వంసం. అందుకే అభిమానులు అతడిని రియల్‌ సూపర్‌ హీరోగా పిలుచుకుంటారు.

అవును..ధోనీ రియల్‌ సూపర్‌హీరో

‘ఐరన్‌ మ్యాన్‌’లా ఎంతటి భయంకరమైన ప్రత్యర్థిని అయినా ధైర్యంగా ఎదుర్కొంటాడు!!
కొండంత లక్ష్యాన్ని అయినా ‘హల్క్‌’లా టార్గెట్‌ను బద్దలుకొడతాడు!!
ఎలాంటి బంతినైనా ‘థోర్‌’లా మెరుపు వేగంతో స్టాండ్స్‌కు తరలిస్తాడు..!!
ఓటమి అంచుల్లో ఉన్నా.. ‘కెప్టెన్ అమెరికా’లా గెలుపు కోసం ఆఖరి వరకు పోరాడి విజయాన్ని సాధిస్తాడు!!
అవును అతడు నిజమైన సూపర్ హీరో!!

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్