మా కన్నీటి బిందువుల్లో నీ ప్రతిబింబమే డీగో!

ఫుట్‌బాల్‌ రారాజు డీగో మారడోనా అస్తమయం క్రీడారంగంలో తీరని శోకం మిగిల్చింది. తనదైన గోల్స్‌తో అలరించిన తమ హీరోను కడసారి చూసేందుకు వేలాది మంది అభిమానులు కదలివచ్చారు. అశ్రు నయనాలతో అంజలి ఘటించారు. అతడి శవపేటికపై అర్జెంటీనా...

Published : 28 Nov 2020 00:27 IST

‘హ్యాండ్స్‌ ఆఫ్ గాడ్స్‌’ వీరుడు ఇక దేవుడి చేతుల్లోకి..

ఆశ్రు నీరాజనాలతో డీగోకు అభిమానుల వీడ్కోలు

ఫుట్‌బాల్‌ రారాజు డీగో మారడోనా అస్తమయం క్రీడారంగంలో తీరని శోకం మిగిల్చింది. తనదైన గోల్స్‌తో అలరించిన తమ హీరోను కడసారి చూసేందుకు వేలాది మంది అభిమానులు కదలివచ్చారు. అశ్రు నయనాలతో అంజలి ఘటించారు. డీగో శవపేటికపై అర్జెంటీనా ప్రభుత్వం పదో నంబరు జెర్సీని ఉంచింది. ‘హ్యాండ్స్‌ ఆఫ్ గాడ్స్‌’తో ప్రాచుర్యం పొందిన డీగోను దేవుడి చేతుల్లో పెట్టింది. ఈ నేపథ్యంలో ఆ ఫుట్‌బాలర్‌ విశేషాలు చిత్రాల రూపంలో..


అద్భుతమైన ఆటతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను సుసంపన్నం చేసిన మారడోనా బుధవారం గుండెపోటుతో మరణించాడు. కళ్లు చెదిరే విన్యాసాలతో 1986లో అర్జెంటీనాకు ప్రపంచకప్‌ను అందించిన అతడు కొకైన్‌ వాడకం, ఊబకాయంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. మెదడుకు శస్త్రచికిత్స తర్వాత రెండు వారాల కిందటే అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కావడం గమనార్హం.


1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో క్వార్టర్‌ఫైనల్లో చేసిన ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌తో గుర్తుండిపోయే డీగో అర్మాండో మారడోనా 20 ఏళ్లకు పైగా అభిమానులను అలరించాడు. పోట్లగిత్తను తలపించే దూకుడుతో, ప్రత్యర్థులను చాకచక్యంగా బోల్తా కొట్టించే నైపుణ్యంతో మారడోనా ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్యుడిగా మారాడు.


సాకర్‌ను పిచ్చిగా ప్రేమించే అర్జెంటీనాలో అతణ్ని ‘గోల్డెన్‌ బాయ్‌’గా పిలుస్తారు. పదో నంబర్‌ జెర్సీ అంటే గుర్తొచ్చేది మారడోనానే. బ్రెజిల్‌ దిగ్గజం పీలే కూడా అదే నంబర్‌ జెర్సీతో ఆడటం గమనార్హం.


ఎటాకింగ్‌లో డీగో దిట్ట. మెరుపు వేగంతో కదులుతూ, ఒక కాలి నుంచి ఇంకో కాలికి వేగంగా బంతిని అలవోకగా మార్చుకుంటూ సాగే అతణ్ని అంచనా వేయడం ప్రత్యర్థి ఆటగాళ్లకు చాలా కష్టంగా ఉండేది. ఎడమ పాదం అతడి బలమైన ఆయుధం. తరచూ దాంతో గోల్స్‌ చేస్తూ ప్రత్యర్థులను షాక్‌కు గురి చేసేవాడు.


పొట్ట పెరగడంతో క్రమంగా అతడి వేగం తగ్గింది. 1991లో డోపింగ్‌ కుంభకోణం అతడికి పెద్ద దెబ్బ. కొకైన్‌కు అలవాటు పడ్డట్లు అప్పుడు అతడు అంగీకరించాడు. 37వ ఏట, 1997లో రిటైరయ్యేంత వరకు ఆ కుంభకోణం వెంటాడింది.


విపరీతంగా బరువు పెరగడం, డ్రగ్స్‌ తీసుకోవడంతో 2000లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కొకైన్‌ వాడకం కారణంగా 2004లోనూ హృదయ సంబంధ సమస్యలను ఎదుర్కొన్నాడు. తాను డ్రగ్‌ సమస్యను అధిగమించినట్లు ఆ తర్వాత డీగో ప్రకటించాడు. కొకైనే తనకు అత్యంత కఠిన ప్రత్యర్థి అని ఓ సందర్భంగా చెప్పాడు.


2005లో శస్త్రచికిత్సతో బరువు తగ్గినా ఆరోగ్య సమస్యలు డిగోని వెంటాడాయి. అతిగా మద్యం తాగడం, తినడంతో 2007లో మరోసారి ఆస్పత్రిపాలయ్యాడు.  ఆ తర్వాత 2008లో అర్జెంటీనా కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. కానీ 2010 ప్రంపచకప్‌ క్వార్టర్‌ఫైనల్లో పరాజయంతో పదవి పోయింది.


నిరుపేద కుటుంబంలో పుట్టిన మారడోనా ఫుట్‌బాల్‌లో ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. ఫిఫా.. 2001లో పీలేతో పాటు అతణ్ని ఫుట్‌బాల్‌ చరిత్రలో మేటి ఆటగాడిగా ప్రకటించింది. డీగో.. 1986 ప్రపంచకప్‌ గెలిచిన అర్జెంటీనా జట్టు కెప్టెన్‌. అర్జెంటీనా తరఫున అతడు 91 మ్యాచ్‌ల్లో 34 గోల్స్‌ కొట్టాడు.


పది క్షణాల్లో.. 11 మంది ప్రత్యర్థి ఆటగాళ్లను దాటుకుంటూ.. ఏ ఒక్కరికీ బంతిని చిక్కనివ్వకుండా నియంత్రిస్తూ 55 మీటర్ల దూరాన్ని దాటి గోల్‌ కొట్టడం మాటలు కాదు. 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై డీగో చేసిన ఈ విన్యాసానికి ఫుట్‌బాల్‌ ప్రపంచం విస్తుపోయింది. దశాబ్దాలు గడిచాక కూడా ఇప్పటికీ ఆ గోల్‌ ఓ అద్భుతంగానే కనిపిస్తుంది. దీన్ని ఫిఫా ‘శతాబ్దపు అత్యుత్తమ గోల్‌’గా గుర్తించింది.


1986లో డీగో అర్జెంటీనా సారథి. ఆ దేశానికి రెండో ప్రపంచకప్‌ అందించి చరిత్రకెక్కాడు. గోల్డెన్‌ బాల్‌ పురస్కారమూ అందుకున్నాడు. అతడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. పీలేను మించిన ఆదరణతో, ప్రపంచ సాకర్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా డీగో గుర్తింపు తెచ్చుకున్న సందర్భమది!


ఓ ఫుట్‌బాల్‌ స్టార్‌ కోసం ఓ క్లబ్‌ మరో క్లబ్‌కు వందలు, వేల కోట్లు చెల్లించడం చూస్తున్నాం. ఈ భారీ లావాదేవీలు మొదలైంది మారడోనాతోనే. 90వ దశకంలో నపోలి క్లబ్‌కు 5 మిలియన్‌ యూరోలు (దాదాపు రూ.43 కోట్లు) చెల్లించి బార్సిలోనా మారడోనాను సొంతం చేసుకోవడం విశేషం. ఆ రోజుట్లో ఫుట్‌బాల్‌ వర్గాల్లో అదో సంచలనం. ఇప్పటి విలువలో ఆ మొత్తం వేల కోట్లతో సమానం!


20వ శతాబ్దపు అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాడు ఎవరన్నది తేల్చేందుకు ‘ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ది సెంచరీ’ అవార్డును సృష్టించగా.. పీలేతో కలిసి మారడోనా దాన్ని గెల్చుకున్నాడు. ఇంటర్నెట్‌ పోల్‌లో అత్యధిక ఓట్లు సాధించడం ద్వారా మారడోనా విజేతగా నిలవగా.. ఫిఫా అధికారులు, పాత్రికేయులు, కోచ్‌ల ఓట్ల ఆధారంగా పీలే సంయుక్త విజేతగా అవతరించాడు.


పుట్‌బాల్‌ చరిత్రలో గొప్ప ఆటగాడు ఎవరు అనే చర్చ వస్తే ఎప్పుడు ముందుండే పేర్లు పీలే, మారడోనా. పీలే మూడు సార్లు ప్రపంచకప్‌ గెలిపించగా, మారడోనా 1986లో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 1990 ఫైనల్‌లో అర్జెంటీనా ఓడిపోయింది. ఒకే శకంలో ఆడకపోయినప్పటికీ.. ఈ ఇద్దరికి ఎప్పుడూ మాటల యుద్ధం జరుగుతూనే ఉండేది. పలు సందర్భాల్లో బాహాటంగానే విమర్శల వర్షం కురిపించుకునేవారు.


2000లో ‘యో సోయ్‌ ఈ డీగో’ పేరిట మారడోనా ఆత్మకథను ప్రచురించాడు. దీనర్థం నేనే డిగో. దీనిపై వచ్చిన క్యూబా రాయల్టీలను ఆ దేశ ప్రజలకు విరాళంగా ఇచ్చాడు డీగో.  మారడోనా మణికట్టుపై చేగువేరా టాటూ ఉంటుంది. ఎడమ కాలి మీద క్యూబా కమ్యూనిస్టు దిగ్గజం ఫిడెల్‌ క్యాస్ట్రో చిత్రాన్ని సైతం టాటూ వేయించుకున్నాడు. సెర్బియాకు చెందిన ఎమిర్‌ కస్టూరికా అనే దర్శకుడు మారడోనాపై డాక్యుమెంటరీని తెరకెక్కించాడు. 2008 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు.


భారత్‌పై డీగోకు ప్రత్యేక అభిమానం ఉండేది. అతడు మూడుసార్లు మన దేశానికి వచ్చాడు. 2008లో ఓ ప్రైవేట్‌ అకాడమీ ప్రారంభోత్సవంతో పాటు ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడేందుకు కోల్‌కతా వచ్చాడు. అప్పుడు తనకు దక్కిన ఆదరణకు పొంగిపోయిన అతను.. ‘‘ఇప్పుడు నాకు అమెరికా అధ్యక్షుడిననిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించాడు. 


చివరి సారిగా 2017లో డీగో కోల్‌కతా వచ్చాడు. అప్పుడు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌గంగూలీ, మారడోనా జట్ల మధ్య జరిగిన ఛారిటీ మ్యాచ్‌ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. అనంతరం శ్రీభూమికి సమీపంలో ఏర్పాటు చేసిన తన 12 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మారడోనాకు దాన్ని చూసి మాటలు రాలేదు. 1986 ప్రపంచకప్‌ను చేతుల్లో పట్టుకున్నట్లుగా ఉన్న ఆ విగ్రహం వంక అలాగే కాసేపు చూస్తుండి పోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని