యూఎస్‌ గ్రాండ్‌స్లామ్‌లో అనూహ్య పరిణామం

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ నెంబర్‌వన్‌, టైటిల్‌ ఫెవరెట్‌గా ఉన్న సెర్బియా ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు............

Updated : 07 Sep 2020 12:56 IST

అర్ధాంతరంగా నిష్క్రమించిన టైటిల్‌ ఫెవరెట్‌ జకోవిచ్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ నెంబర్‌వన్‌, టైటిల్‌ ఫెవరెట్‌గా ఉన్న సెర్బియా ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌ టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. దీంతో ఆయన 29 వరుస విజయాలు, 18వ గ్రాండ్‌ స్లామ్‌ ఆశలకు బ్రేక్‌ పడినట్లయింది. 

జకోవిచ్ అనుకోకుండా‌ వెనక్కి విసిరిన ఓ బంతి అక్కడే ఉన్న లైన్‌ అంపైర్‌కు బలంగా తగలడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు. గొంతు సమీపంలో తగలడంతో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టోర్నీ రెఫరీ సోరెన్‌ ఫ్రీమెల్‌, గ్రాండ్‌ స్లామ్‌ సూపర్‌వైజర్‌ ఆండ్రియాస్‌ ఎగ్లీ.. జకోవిచ్‌తో 10 నిమిషాల పాటు మంతనాలు జరిపారు. ఆ సమయంలో జకోవిచ్‌ వారిని ప్రాధేయపడినట్లు దృశ్యాల్లో కనిపించింది. కొద్దిసేపటి తర్వాత జకోవిచ్‌ మ్యాచ్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఫ్రీమెల్‌ ప్రకటించాడు. కోర్టులో ఆటగాడు కావాలని ప్రమాదకరంగా బంతిని విసరడం ఆట నిబంధనలకు విరుద్ధం. 

దీనిపై స్పందించిన యూఎస్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌.. నిబంధనల ప్రకారమే ఫ్రీమెల్‌ జకోవిచ్‌ను టోర్నీ నుంచి బహిష్కరించారని ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇప్పటి వరకు టోర్నీలో జకోవిచ్‌ సాధించిన ర్యాంకింగ్‌ పాయింట్లతో పాటు 250,000 అమెరికన్‌ డాలర్ల నగదు ప్రోత్సాహకాన్ని కూడా కోల్పోనున్నాడు. 26-0 విజయాలతో జకోవిచ్‌ ఈ టోర్నీలో టైటిల్‌కు దగ్గరగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన 17 గ్రాండ్‌ స్లామ్‌లను సాధించాడు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లైన రోజర్‌ ఫెదరర్‌-20, రఫేల్‌ నాదల్‌-19 తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే, ఈ మెగాగ్రాండ్‌ స్లామ్‌ ఈవెంట్‌లో వీరిద్దరూ ఆడటం లేదు. దీంతో ఈసారి యూఎస్‌ ఓపెన్‌ను జకోవిచే సొంతం చేసుకునే వీలుందని అందరూ భావించారు. ఇప్పటికే మూడుసార్లు ఈ టైటిల్‌ సాధించిన అతడు నాలుగోసారీ అందుకునేందుకు దగ్గరగా వెళ్లి భంగపడ్డాడు. ఇది గెలిస్తే జకోవిచ్‌ 18వ గ్రాండ్‌స్లామ్‌ సాధించిన ఆటగాడిగా నిలిచేవాడు.

ఇదీ చదవండి..

అదరగొడుతున్న అమ్మలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని