
అది సాక్షి ధోనీ నిర్ణయమే: బ్రావో
దాన్ని ధోనీకి ఫేర్‌వెల్‌గా ఇవ్వొద్దని అనుకున్నా..
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కొద్ది రోజుల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, విండీస్ క్రికెటర్ డ్వేన్‌బ్రావో అంతకుముందే ధోనీ 39వ పుట్టినరోజు సందర్భంగా జులై 7న ‘హెలికాఫ్టర్ పాట’ను అంకితమిచ్చాడు. ఆ పాటను తమ సారథికి ఫేర్‌వెల్‌గా ఇవ్వలేదని, అలాగే దాన్ని విషాద గీతికగాను ఇవ్వదల్చుకోలేదని బ్రావో స్పష్టం చేశాడు. తాజాగా అతడు ఓ మీడియాతో మాట్లాడుతూ ‘హెలికాఫ్టర్ పాట’పై స్పందించాడు.
‘ధోనీ మీద పాటకు విశేషమైన స్పందన వచ్చింది. అతడి నుంచే కాకుండా సతీమణి సాక్షి నుంచి కూడా మద్దతు లభించింది. అలాగే ఈ పాటలోని కొన్ని కీలక విషయాలకు ఆమె సహకరించారు. ఆ పాటకు ‘హెలికాఫ్టర్’ అనే పేరు ఆమెనే పెట్టారు. నైనేతే దాన్ని ‘నంబర్ 7’గా పిలుద్దామనుకున్నా. ఈ విషయంలో ధోనీ అభిమానులను కూడా సంప్రదించా. దీన్ని రూపొందించినందుకు చాలా సంతోషంగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో పంచుకోగానే గంటలో లక్షలాదిమంది వీక్షించారు’ అని బ్రావో పేర్కొన్నాడు.
ధోనీ రిటైరవ్వకముందే ఆ పాటను రూపొందించాలని తన సంగీత బృందానికి చెప్పానని, అది అతడికి ఫేర్‌వెల్‌లాగా లేదా విషాద పాటగా కాకూడదనుకున్నట్లు చెప్పాడు. మహీ ఆడుతున్నప్పుడే అతడు సాధించిన ఘనతలను అభివర్ణిస్తూ పాటను తయారు చేయాలనుకున్నట్లు వివరించాడు. ఏ ఆటగాడైనా రిటరయ్యే ముందు చాలా మంది అభిమానులు వాళ్ల గురించి మాట్లాడుకుంటారని, అయితే.. తాను మాత్రం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకోలేదన్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడటమేనని మాజీ ఆల్‌రౌండర్ అభిప్రాయపడ్డాడు.