కథ మారేందుకు ఒక్క సిక్సర్‌ చాలని తెలుసు

ఒక్క సిక్సర్‌తో కథ మారిపోతుందని తనకు ముందే తెలుసని రాజస్థాన్‌ సూపర్‌ హిట్టర్‌ రాహుల్‌ తెవాతియా అన్నాడు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదడం అద్భుతమని పేర్కొన్నాడు. తాను బంతిని స్టేడియం దాటించగలనని జట్టుకు తెలుసని వెల్లడించాడు. పంజాబ్‌పై విజయం తర్వాత అతడు మాట్లాడాడు....

Published : 28 Sep 2020 13:17 IST

రాజస్థాన్‌ గెలుపు వీరుడు రాహుల్‌ తెవాతియా

షార్జా: ఒక్క సిక్సర్‌తో కథ మారిపోతుందని తనకు ముందే తెలుసని రాజస్థాన్‌ సూపర్‌ హిట్టర్‌ రాహుల్‌ తెవాతియా అన్నాడు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదడం అద్భుతమని పేర్కొన్నాడు. తాను బంతిని స్టేడియం దాటించగలనని జట్టుకు తెలుసని వెల్లడించాడు. పంజాబ్‌పై విజయం తర్వాత అతడు మాట్లాడాడు.

షార్జా వేదికగా జరిగిన మ్యాచులో మొదట పంజాబ్‌ 223/2 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (106; 50 బంతుల్లో 10×4, 7×6), రాహుల్‌ (69; 54 బంతుల్లో 7×4, 1×6), పూరన్ ‌(25*; 8 బంతుల్లో 1×4, 3×6) అద్భుతంగా ఆడారు. ఛేదనలో సంజు శాంసన్‌ (85; 42 బంతుల్లో 4×4, 7×6), స్టీవ్‌ స్మిత్‌(50; 27 బంతుల్లో 7×4 2×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడారు.

స్మిత్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన తెవాతియా (53; 31 బంతుల్లో 7×6) పంజాబ్‌కు చుక్కలు చూపించాడు. తొలుత 19 బంతుల్లో 8 పరుగులే చేసిన అతడు కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి రాజస్థాన్‌ గెలుపు బాటలు వేశాడు. చివరి 12 బంతుల్లోనే 45 పరుగులు సాధించి విమర్శకుల నోటికి తాళం వేశాడు.

‘నేను బంతిని దూరంగా కొట్టగలనని డగౌట్‌లోని వారికి తెలుసు. నన్ను నేను నమ్మాలని భావించా. ఒక్క సిక్సర్‌ కొడితే అంతా మారిపోతుంది. అయితే ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం మాత్రం అద్భుతమే. నిజానికి లెగ్‌స్పిన్‌లో షాట్లు ఆడేందుకు ప్రయత్నించా. కానీ కుదర్లేదు. అందుకే మిగతా బౌలర్ల బౌలింగ్‌లో దంచేశా. ఇప్పుడు నేను మెరుగ్గా ఉన్నాను. మొదట 20 బంతుల్లో ఆడినట్టు ఎప్పుడూ ఆడలేదు. ఆ తర్వాత బాదడం షురూ చేశాను’ అని తెవాతియా చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని