హార్దిక్‌ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా!

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో ఓటమిపాలైనప్పటికీ భారత్‌ 2-1 తేడాతో సిరీస్‌ సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరించిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ లభించింది

Published : 09 Dec 2020 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో ఓటమిపాలైనప్పటికీ భారత్‌ 2-1 తేడాతో సిరీస్‌ సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరించిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ లభించింది. అయితే తనకి దక్కిన అవార్డును యువ సంచలన బౌలర్‌ టీ నటరాజన్‌కు హార్దిక్‌ అందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో కెరీర్‌ ఆరంభ మ్యాచ్‌ల్లోనే గొప్పగా బౌలింగ్ చేసిన నటరాజన్‌కు ఈ అవార్డు దక్కాలని ట్విటర్‌ వేదికగా తెలిపాడు. 

‘‘నటరాజన్‌.. ఈ సిరీస్‌లో నువ్వు చేసిన ప్రదర్శన అద్భుతం. అరంగేట్ర మ్యాచ్‌ల్లోనే క్లిష్ట పరిస్థితుల్లో గొప్పగా బౌలింగ్‌ చేసిన విధానమే చెబుతుంది నీ శ్రమ, సామర్థ్యాల గురించి. నా దృష్టిలో ‘మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌’ దక్కాల్సింది నీకే. సిరీస్ గెలిచినందకు టీమిండియాకు శుభాకాంక్షలు’’ అని నటరాజన్‌, భారత జట్టు ఫొటోలతో హార్దిక్‌ ట్వీట్ చేశాడు. రెండో టీ20లో హార్దిక్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అనంతరం కూడా నట్టూకే అవార్డు దక్కాల్సిందని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే నటరాజన్‌ను ప్రోత్సహిస్తున్న హార్దిక్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. తన గొప్ప మనుసును ప్రశసింస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తున్నారు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం నటరాజన్‌కే టీ20 సిరీస్ ట్రోఫీని అందించడం విశేషం. యువ ఆటగాడిని ప్రోత్సహిస్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉందని కోహ్లీని ప్రశసింస్తున్నారు.

బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని యార్కర్లు, ఆఫ్‌ కట్టర్లు, నెమ్మది బంతులతో నటరాజన్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. సీనియర్‌ పేసర్లు బుమ్రా, షమి జట్టులో లేకపోయినా పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై భారత్‌ టీ20 సిరీస్‌ గెలవడంలో నటరాజన్‌ కీలకపాత్ర పోషించాడు. తొలి టీ20లో మూడు వికెట్లతో సత్తాచాటాడు. రెండో టీ20లో సహచరులంతా భారీ పరుగులు ఇవ్వగా అతడు నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మంగళవారం జరిగిన ఆఖరి టీ20లోనూ అందరికంటే పొదుపుగా బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్ తీశాడు.

ఇదీ చదవండి

ఆసీస్‌ను భయపెడతాం: కోహ్లీ

కోహ్లీ పోరాడినా భారత్‌కు తప్పని ఓటమి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని