సిక్సర్లు కొట్టే బలం నాన్న ఇచ్చిందే..!

కొడితే బంతి బౌండరీ లైన్‌ దాటాల్సిందే..! అన్నట్టుగా ఆడుతున్నాడు యువ ఆటగాడు సంజు శాంసన్‌. క్రీజులో ఎక్కువగా కదలికలేమీ కనిపించవు. కరీబియన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్ల మాదిరిగా భారీ ఆకారమూ కాదు. చూడ్డానికి కాలేజీ కుర్రాడిలా స్లిమ్‌గా ఉంటాడు....

Published : 28 Sep 2020 12:00 IST

పవర్‌ హిట్టింగ్‌పై సంజు

(Twittr/Sanjusamson)

షార్జా: కొడితే బంతి బౌండరీ లైన్‌ దాటాల్సిందే..! అన్నట్టుగా ఆడుతున్నాడు యువ ఆటగాడు సంజు శాంసన్‌. క్రీజులో ఎక్కువగా కదలికలేమీ కనిపించవు. కరీబియన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్ల మాదిరిగా భారీ ఆకారమూ కాదు. చూడ్డానికి కాలేజీ కుర్రాడిలా స్లిమ్‌గా ఉంటాడు. ఐనా సరే బంతిని సునాయసంగా స్టేడియం దాటించేస్తున్నాడు. లీగ్‌లో అభిమానులను అలరిస్తున్నాడు.

పదమూడో సీజన్‌లో వరుసగా రెండో అర్ధశతకం బాదేశాడు సంజు. షార్జా వేదికగా చెన్నైతో మ్యాచులో 32 బంతుల్లోనే 9 సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 74 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ ఏకంగా 231.25. ఇక పంజాబ్‌పై అదే మైదానంలో  అంతకన్నా భీకరంగా ఆడాడు. 42 బంతుల్లో 202.38 స్ట్రైక్‌రేట్‌తో 7 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 85 పరుగులు చేశాడు. లీగ్‌లోనే అత్యంత భారీ ఛేదన (224)లో విజయం అందించాడు. క్రీజులో కదలకుండానే భారీ సిక్సర్లు బాదే బలం తన తండ్రి నుంచి వచ్చిందని సంజు చెప్పాడు.

‘ఏడాది కాలంగా బంతిని అద్భుతంగా బాదుతున్నాను. ఎప్పటిలాగే ఆత్మవిశ్వాసంతో ఆడాను. మ్యాచులు గెలిపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అనుకున్నది జరగకపోవడంతో ఎంతో కష్టపడ్డాను. ఎంతో ప్రయత్నించి చిరాకు పడ్డ తర్వాత ఆత్మశోధన చేశాను. నన్ను నేను వెతుకున్నాను. అదే పనిచేసింది. నేనేం సాధించాలని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. పదేళ్లుగా ఈ అందమైన ఆట ఆడుతున్నానని చెప్పుకున్నాను. ఈ దశాబ్దకాలంలో ఆటకోసం ఎంతో కృషి చేశాను. ఇక సిక్సర్లు బాదే శక్తి గురించి చెప్పాలంటే అది జన్యువుల ప్రభావమే. ఎందుకంటే మా నాన్న చాలా గట్టిమనిషి’ అని సంజు చెప్పాడు. కాగా పంజాబ్‌పై విజయం అందించిన శాంసన్‌, తెవాతియాను రాజస్థాన్‌ సారథి స్టీవ్‌స్మిత్‌ ప్రశంసల్లో ముంచెత్తాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని