ధోనీది కంప్యూటర్‌ లాంటి క్రికెట్‌ బ్రెయిన్

టీమ్‌ఇండియా దిగ్గజ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఆటకు వీడ్కోలు పలికి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా ప్రశంసల జల్లులు కురుస్తూనే ఉన్నాయి. తన ఆటతో, కెప్టెన్సీతో కేవలం భారత్‌లోనే...

Published : 20 Aug 2020 13:32 IST

ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ కెప్టెన్‌: టామ్‌మూడీ

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా దిగ్గజ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఆటకు వీడ్కోలు పలికి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా ప్రశంసల జల్లులు కురుస్తూనే ఉన్నాయి. తన ఆటతో, కెప్టెన్సీతో కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహీ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన వ్యక్తిత్వంతో ఇతర దేశాల దిగ్గజాలను సైతం తనని అభిమానించే విధంగా ఎదిగాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ఓ వీడియోలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ టామ్‌మూడీ, వెస్టిండీస్‌ మాజీ బౌలర్‌ ఇయాన్‌ బిషప్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షాభోగ్లే మాజీ సారథిని ప్రశంసలతో ముంచెత్తారు. ధోనీ ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ఆటగాళ్లలో ఒకడని మూడీ అన్నాడు.

‘ధోనీ ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ క్రికెటర్లలో ఒకడు. అందుకు కారణం ఒత్తిడి సమయాల్లోనూ అతడు ప్రశాంతంగా ఉండడమే. అదే లక్షణం తన జట్టుకు అలవడింది. దాంతో క్రికెట్‌ను ఎలా ఆడాలో వాళ్లు అలాగే ఆడుతున్నారు. ఎంతో స్వేచ్ఛగా ఆడుతున్నారు. అదే ధోనీ ప్రత్యేకత. టెక్నిక్‌లో అతడో బ్రిలియంట్‌. తన నిర్ణయాల పట్ల ఎంతో కచ్చితంగా ఉంటాడు. ఆ విషయంలో ఆటకన్నా రెండింతల ముందే ఉంటాడు. ఒక కెప్టెన్‌గా ఆటగాళ్లని సహజసిద్ధంగా ఆడమని ప్రోత్సహిస్తాడు. నాయకత్వ లక్షణాల్లో అదే గొప్ప విషయం’ అని మూడీ పేర్కొన్నాడు. 

ఇక ఇయాన్‌ బిషప్‌ మాట్లాడుతూ.. ‘టీమ్‌ఇండియాలోని ప్రతీ ఆటగాడికీ ధోనీ ఒక నాయకుడు. ఎవర్నైనా ఆదేశించే స్థాయిలో ఉన్నా ఎంతో వినమ్రంగా ఉంటాడు. తన సారథ్యంలో ఆడేవారితో ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. అతడిలో ఉండే ఆత్మవిశ్వాసం, నమ్మకం బయటకు కనిపించవు. అలా కెప్టెన్సీ అధికారాన్ని పక్కకు పెట్టేయడం చాలా మంచి విషయం. ఆ విషయంలో చరిత్ర ఎప్పటికీ అతడిని గుర్తుంచుకుంటుంది. అలాగే ఆటలో అతడిది కంప్యూటర్‌ వంటి క్రికెట్‌ బ్రెయిన్‌. తను తీసుకునే నిర్ణయాలు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. అయినా, ఎంతో అనుకువుగా ఉంటాడు. ఒక నాయకుడిగా భారత క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనే అద్భుతమైన ఆటగాడిగా నిలిచిపోతాడు. టీమ్‌ఇండియా అతడిని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’ అని వివరించాడు

‘ధోనీకుండే ప్రశాంత స్వభావాన్ని నేను ఆస్వాదించాను. అతడిలో ఎలాంటి కోపతాపాలు చూడలేదు. టీమ్‌ఇండియా కూడా అతడి సారథ్యంలో అద్భుతంగా నడిచింది. ఇక టెస్టు కెప్టెన్‌గా నన్నెంతో ఆకట్టుకున్నాడు. అలాగే వన్డే క్రికెట్‌లో సుప్రీమ్‌గా ఎదిగాడు. అందులో అతడికి ఎవరూ సాటిరారు’ అని హర్షాభోగ్లే వ్యాఖ్యానించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని