చెన్నై జట్టుకు అంత తేలిక కాదు: పఠాన్‌ 

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో హర్భజన్‌ సింగ్‌ లేని లోటును పూరించడం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అంత తేలిక కాదని మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 07 Sep 2020 01:13 IST

భజ్జీ లేని లోటును పూరించడంపై..

(ఫొటో: ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో హర్భజన్‌ సింగ్‌ లేని లోటును భర్తీ చేయడం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అంత తేలిక కాదని మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. అలాగే అదే జట్టును నుంచి తప్పుకొన్న కీలక బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా మళ్లీ జట్టుతో కలిసే అవకాశాలున్నాయని చెప్పాడు. తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఇంకా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ నిష్క్రమించడంపై స్పందిస్తూ ఇలా అన్నాడు. ప్రస్తుతం సురేశ్‌ రైనా భారత్‌కు తిరిగి వచ్చినా ఒక్కసారి అతడి కుటుంబ పరిస్థితులు మెరుగు పడితే మళ్లీ దుబాయ్‌ ఫ్లైట్‌ ఎక్కే అవకాశం ఉందని చెప్పాడు. తనకు కూడా అతడు ఆడితే చూడాలని ఉందన్నాడు. మరోవైపు సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌పై స్పందిస్తూ.. అతడి స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలిక కాదన్నాడు.

‘భజ్జీ లేని లోటును భర్తీ చేయడానికి సీఎస్కే అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఆ విషయంపై నాకు సమాచారం కూడా ఉంది. అందుకోసం ముగ్గురు, నలుగురు బౌలర్లను పరిశీలిస్తున్నారు. అయితే, అదంత తేలికైన పని కాదు. దేశవాళీ క్రికెట్‌లో నాణ్యమైన ఆఫ్‌స్పిన్నర్లు లేరు. హర్భజన్‌కు ముఖ్యంగా లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌పై ఆడిన అనుభవం ఉంది. వాళ్లపై మంచి ఆధిపత్యం చెలాయిస్తాడు. కొత్త బంతితో మాయ చేయగలడు. అలాగే పవర్‌ప్లేలోనూ నమ్మకమైన బౌలర్‌. కాబట్టి అతడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టతరమే’ అని ఇర్ఫాన్‌ చెప్పుకొచ్చాడు. కాగా, రైనా, హర్భజన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కీలకమైన ఆటగాళ్లు. ఇప్పటికే వీరిద్దరూ మెగా టోర్నీలో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. రైనా ఇప్పటికే ఐపీఎల్‌లో విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతుండగా, భజ్జీ అత్యధిక వికెట్ల వీరుడిగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని