జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ బాధ్యతలంటే దేశానికి సేవే

తన కెరీర్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ స్ఫూర్తిగా నిలిచాడని, అయితే టీమ్‌ఇండియా మాజీ ఛాంపియన్‌ కపిల్‌దేవ్‌ కన్నా పెద్ద హీరో లేడని ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు...

Published : 07 Aug 2020 02:58 IST

అందుకు కపిల్‌దేవే కారణం: ఇర్ఫాన్‌ పఠాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: తన కెరీర్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ స్ఫూర్తిగా నిలిచాడని, అయితే టీమ్‌ఇండియా మాజీ ఛాంపియన్‌ కపిల్‌దేవ్‌ కన్నా పెద్ద హీరో లేడని ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన మాజీ పేసర్‌ కపిల్‌దేవ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనో మ్యాచ్‌ విన్నర్‌ అని, బ్యాట్‌తో పాటు బంతితో రాణించే అద్భుత ఆటగాడని మెచ్చుకున్నాడు. టీమ్‌ఇండియాలో ఎవరైనా ఆల్‌రౌండర్‌ అవ్వాలంటే అతనికి మించిన క్రికెటర్‌ లేడన్నాడు. అలాగే తన బాల్యంలో.. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్‌దేవ్‌ సాధించిన 175 పరుగుల గురించి కథలు కథలుగా చెప్పేవారని గుర్తుచేసుకున్నాడు. జట్టులో అందరూ నిరాశపర్చినా.. తమ హీరోలు ఒంటరి పోరాటం చేసి మ్యాచ్‌ను గెలిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని తెలిపాడు. అలా మొత్తం జట్టు భారాన్ని ఒక్కడే తన భుజాలపై మోయడానికి మించిన ధీరత్వం ఏముంటుందని ప్రశ్నించాడు.

అదే ప్రపంచకప్‌ ఫైనల్లో వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ పట్టుకోవడం మాజీ సారథి ఘనతల్లో తాను చూసింది మొదటిది అని తెలిపాడు. కపిల్‌ బౌలింగ్‌ యాక్షన్‌ ప్రత్యేకంగా ఉంటుందని, దాన్ని కాపీ చేయడం కష్టతరమని చెప్పాడు. అతడిలా వేరే ఎవరూ బౌలింగ్‌ చేయలేరన్నాడు. ఇక 2004 పాకిస్థాన్‌ పర్యటనకు ముందు మాజీ ఛాంపియన్‌ తనకు బౌలింగ్‌ యాక్షన్‌కు సంబంధించి పలు సూచనలు చేశాడని గుర్తుచేసుకున్నాడు. అలాగే 2017-18లో తాను జమ్మూ-కశ్మీర్‌ క్రికెట్‌కు మార్గనిర్దేశకుడిగా (మెంటార్‌) మారడంలోనూ అతడి పాత్రే కీలకమని స్పష్టంచేశాడు. దేశానికి ఏదైనా సేవ చేయాలని ఉంటే.. ఇతర లీగ్‌ల మీద దృష్టి పెట్టకుండా ఆ రాష్ట్ర క్రికెట్‌ బాధ్యతలు తీసుకోవాలని సూచించాడని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. అక్కడి యువకులను క్రికెట్‌ వైపు మళ్లించడమంటే దేశానికి సేవచేసినట్లని, మాజీ సారథి తనతో అన్నాడని వెల్లడించాడు.

ఇదిలా ఉండగా, 2004లో టీమ్‌ఇండియాకు ఎంపికైన పఠాన్‌ స్వల్పకాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన బౌలింగ్‌, బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అలాంటి క్రికెటర్‌ 2012లో చివరి మ్యాచ్‌ ఆడగా తర్వాత దేశవాళీ క్రికెట్‌లో కొనసాగాడు. ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా జమ్మూకశ్మీర్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని