ధోనీ.. నువ్వు నన్నెప్పుడూ ఔట్‌ చెయ్యలేదు

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించాక ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందరూ చెప్పుకునేట్టు టెస్టు క్రికెట్‌లో తాను...

Published : 17 Aug 2020 20:00 IST

2011 నాటి లార్డ్స్‌ టెస్టును గుర్తుచేసిన కెవిన్‌ పీటర్సన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించాక ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందరూ చెప్పుకునేట్టు టెస్టు క్రికెట్‌లో తాను అతడికి తొలి వికెట్‌ కాదని స్పష్టంచేశాడు. శనివారం మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా క్రికెట్‌ వర్గాల నుంచి అతడికి సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పీటర్సన్‌ కూడా స్పందించాడు. ధోనీకి శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోలో మాట్లాడాడు. దాన్ని స్టార్‌స్పోర్ట్స్‌ ట్విటర్‌లో పంచుకోగా.. అందులో ఇలా అన్నాడు. 

‘ధోనీ నాకు మంచి మిత్రుడు. అతడి కెరీర్‌ చాలా గొప్పగా సాగింది. అదొక మ్యాజికల్‌ కెరీర్‌ అని చెప్పొచ్చు. అలాంటి ఆట పట్ల గర్వంగా ఉండాలి. ధోనీ ఆట చూడటానికి భారత దేశంతో పాటు క్రికెట్‌ ప్రపంచం కూడా అదృష్టం చేసుకుంది. అయితే, ఇప్పుడు నీ క్రికెట్‌ కెరీర్‌ పూర్తయిన సందర్భంగా ఒక విషయం చెప్పాలి. లార్డ్స్‌ టెస్టులో నన్ను ఔట్‌ చేశావని, టెస్టుల్లో నేను నీకు తొలి వికెట్‌ అని.. నువ్వూ, నీ అభిమానులు నన్నెప్పుడూ అంటుంటారు. కానీ అది జరగలేదని నీకూ నాకు తెలుసు. నువ్వు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ఈ విషయంపై స్పష్టతనిస్తున్నా. అదెప్పుడూ జరగలేదు. ఏదైమైనా అద్భుతమైన కెరీర్‌కు కంగ్రాట్స్‌. మా క్లబ్‌లోకి సుస్వాగతం’ అని సరదాగా ఛమత్కరించాడు. 

అసలేం జరిగిందంటే.. 2011లో లార్డ్స్‌ మైదానం వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ ఓ టెస్టు మ్యాచ్‌ ఆడాయి. అప్పుడు ఇంగ్లాండ్‌ 217/3 స్కోర్‌ వద్ద పీటర్సన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అదే సమయంలో ధోనీ బౌలింగ్‌ చేయగా ఒక బంతిని ఎల్బీడబ్ల్యూకు అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ దాన్ని తిరస్కరించాడు. తర్వాత మరో బంతికి వికెట్ల వెనుక దొరికిపోయాడు. ధోనీతో పాటు అందరూ అప్పీల్‌ చేయగా అంపైర్‌ ఔటిచ్చాడు. దానికి పీటర్సన్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లడంతో నాటౌట్‌గా తేలింది. అయినా, అప్పటి నుంచి ధోనీ, అతడి అభిమానులు పీటర్సన్‌ను పలు సందర్భాల్లో ఆటపట్టించారు. ధోనీకి టెస్టుల్లో అతడే తొలి వికెట్‌ అని సరదాగా అంటుంటారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లీష్‌ మాజీ క్రికెటర్‌ స్పందిస్తూ ధోనీ తననెప్పుడూ ఔట్‌ చేయలేదని మరోసారి చెప్పుకొచ్చాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని