Updated : 04/09/2020 17:36 IST

IN PICS: మహీ అంటే అంతేగా మరి!

జై జవాన్‌ జై కిసాన్‌ నినాదమే అతడి గుండె సవ్వడి

ఆస్తిపాస్తులు ఎన్నివున్నా చిన్ననాటి మిత్రులతో షికారే ఇష్టం

అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్రసింగ్‌ ధోనీ వీడ్కోలు పలికి అప్పుడే మూడు రోజులు అవుతోంది. తనకు అలవాటైన శైలిలో కూల్‌గా రిటైర్‌మెంట్‌ ప్రకటించడంతో అందరూ షాకయ్యారు. మరో ఏడాదైనా ఆడితే బాగుండేదని అనుకుంటున్నారు! బ్యాటింగ్‌, కీపింగ్‌, కెప్టెన్సీలో అతడు సాధించిన ఘనతలను పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. క్రికెటర్లతో వీడియో గేములు ఆడటం, కుమార్తె జీవాతో కలిసి సందడి చేయడం, సతీమణి సాక్షితో ప్రేమాయణం, చెపాక్‌లో బాదిన సిక్సర్లను నెమరు వేసుకుంటున్నారు.


మీకో విషయం తెలుసా? మహీ పూర్తిపేరు ‘మహేంద్రసింగ్‌ పాన్‌సింగ్‌ ధోనీ’. అభిమానులు మహీ, కెప్టెన్‌ కూల్‌, ఎంఎస్‌డీ, తలా అని ఇష్టంగా పిలుస్తారు. ధోనీ సోదరి పేరు జయంతి గుప్తా, సోదరుడు నరేంద్ర సింగ్‌ ధోనీ. ఇక సతీమణి సాక్షి, కుమార్తె జీవా గురించి అందరికీ తెలిసిందే.


మహీ ఆదర్శ క్రికెటర్లు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, సచిన్‌ తెందూల్కర్. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, గాయని లతా మంగేష్కర్‌ అంటే ఇష్టం. నిజానికి అతడు ఫుట్‌బాల్‌లో గోల్‌కీపర్‌ అవ్వాల్సింది. పాఠశాల క్రికెట్‌ జట్టుకు ఓసారి కీపర్‌ దొరక్కపోతే ఫుట్‌బాల్‌ ఆడుతున్న ధోనీని కోచ్‌ చూశాడు. మ్యాచ్‌ ఆడించాడు. దాంతో అతడి జీవితంలో క్రికెట్‌ భాగంగా మారిపోయింది. మొదట్లో స్థానిక క్లబ్బులు, 2001-2003 మధ్య రైల్వేకు ఆడాడు. కొన్నాళ్లు టీటీఈగా పనిచేస్తూ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.


1999-2000 సీజన్లో బిహార్‌ తరఫున ధోనీ రంజీల్లో అరంగేట్రం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 68* పరుగులు చేశాడు. 2004, డిసెంబర్‌ 23న బంగ్లాదేశ్‌పై వన్డేల్లో, 2005, డిసెంబర్‌ 2న శ్రీలంకపై టెస్టుల్లో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. 2006లో దక్షిణాఫ్రికాపై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. టెస్టు కెరీర్‌ 2014, డిసెంబర్‌ 30న, వన్డే కెరీర్‌ 2019, జులై 10న, టీ20 కెరీర్‌ 2019, ఫిబ్రవరి 27న ముగిశాయి.


టీమ్‌ఇండియాకు చేసిన సేవలకు ప్రభుత్వం ధోనీని అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. మొదట పద్మశ్రీ, తర్వాత పద్మ భూషణ్‌తో గౌరవించింది. సైనిక దుస్తుల్లో అతడు పద్మభూషణ్‌ను అందుకోవడం గమనార్హం. ఎందుకంటే సైన్యంలో మహీ లెఫ్ట్‌నెంట్‌ కర్నల్‌. భారత క్రికెటర్లలో కపిల్‌ దేవ్‌ తర్వాత ఈ ర్యాంకు పొందింది అతడే కావడం గమనార్హం.


మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథి మహీ మాత్రమే. 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీని అందించాడు. అతడి ఖాతాలో రెండు ఆసియా కప్పులూ ఉన్నాయి. ఈ ఘనత ఎప్పటికీ అతడి పేరుతోనే ఉంటుందని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. దీనిని తిరిగరాయడం సులువుకాదని పేర్కొన్నారు.


భారత సైన్యంలో ధోనీ పారాచూట్‌ విభాగంలో పనిచేశాడు. విధుల్లో భాగంగా పారాచూట్‌తో విమానం నుంచి కిందకు దూకాడు. ‘గతేడాది ఇదే సమయంలో మా బృందం నాలుగు పగళ్లు, ఒక రాత్రి జంప్‌ చేశాం. 22 రోజుల శిక్షణ అద్భుతంగా సాగింది’ అని గతంలో సోషల్‌ మీడియాలో పెట్టాడు. సరిహద్దుల్లోనూ అతడు విధులు నిర్వర్తించాడు. 2019 ప్రపంచకప్‌ ముగిశాక అతడు రెండు నెలలు సైన్యంలో పనిచేసి వచ్చాడు.


మహీ నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన రెండో జట్టు. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ అందుకుంది. 2016లో ఆ జట్టుపై నిషేధం విధించడంతో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌కు ధోనీ ఆడాడు. మళ్లీ 2018లో చెన్నై తరఫున రీఎంట్రీ ఇచ్చి టైటిల్‌ గెలిచాడు. డాడీస్‌ ఆర్మీ అని అందరూ ఎగతాళి చేసినా కసితో విజయం సాధించామని ఓ సందర్భంలో ధోనీ చెప్పొకొచ్చాడు.


సతీమణి సాక్షి, కుమార్తె జీవా అంటే మహీకి పంచప్రాణాలు! మ్యాచుల్లేనప్పుడు వారితోనే సమయం గడుపుతాడు. సాక్షికి ఒకసారి పాదరక్షలు కొనిచ్చి స్వయంగా అతడే తొడిగాడు. మరోసారి బ్రేస్‌లెట్‌‌ ఇచ్చాడు. ఇక కుమార్తెతో ఎప్పుడూ ఆడుతూనే ఉంటాడు. తాజ్‌ హోటల్లో పనిచేస్తున్న సాక్షిని ధోనీ ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మహీ చదివిన పాఠశాలలోనే చదుకోవడం గమనార్హం.


ధోనీకి క్రికెట్‌తోనే కాకుండా ఇతర క్రీడలతోనూ సంబంధాలు ఉన్నాయి. హాకీ ఇండియా లీగ్‌లో ‘రాంచీ రేస్‌’కు అతడే యజమాని. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో ‘చెన్నైయిన్‌ ఎఫ్‌సీ’కి సహ యజమాని. బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌‌ బచ్చన్‌, విటా దాని భాగస్వాములు. రితీ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ అనే వ్యాపార సంస్థా అతడికి ఉంది.


రొటీన్‌కు భిన్నంగా ఉండటం ధోనీకి ఇష్టం. ఒకవైపు ఖరీదైన బైకులు, వాహనాలంటే ఇష్టం. హెల్మెట్‌ పెట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా తిరిగొస్తాడు. మరోవైపు రైతుగా ఉంటాడు. రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో అతడు సేంద్రియ  వ్యవసాయం చేయిస్తున్న సంగతి తెలిసింది. ఎండకాలంలో పుచ్చకాయలు పండించాడు. కొన్నాళ్ల తర్వాత బొప్పాయి సాగు మొదలుపెట్టాడు.


మహీకి షూటింగ్‌ అంటే పిచ్చి. అందుకే తుపాకీలుండే వీడియోగేమ్‌లు ఎక్కువగా ఆడతాడు. తన ఇంటి ఆవరణలో షూటింగ్‌ యార్డ్‌ కూడా ఉంది. ‘యాడ్‌ షూటింగ్‌ కన్నా తుపాకీ షూటింగ్‌ చాలా సరదాగా ఉంటుంది’ అని ఓసారి అన్నాడు. అంతేకాదు టీమ్‌ఇండియా, సీఎస్కే సభ్యులతో కలిసి వీడియో గేమ్‌లు బాగా ఆడతాడు. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ నటించిన ‘ఎంఎస్‌ ధోనీ అన్‌టోల్డ్‌ స్టోరీ’ సినిమా మహీ గురించి తెలియని విశేషాలను చూపించింది.


2008, 2009లో ధోనీ ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులు గెలిచాడు. 2008లో రాజీవ్‌ ఖేల్‌రత్న అందుకున్నాడు. క్రికెట్లో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎందరో కొత్త స్నేహితులు లభించారు. అయినప్పటికీ తన చిన్ననాటి మిత్రులను కలిసేందుకు, వారితో గడిపేందుకు మహీ విలువిస్తాడు. వారితో కలిసి ప్రయాణాలు చేస్తుంటాడు.

-ఇంటర్‌నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని