మళ్లీ.. మళ్లీ నువ్వు గుర్తొస్తావు మహీ!

పదహారేళ్ల క్రితం జులపాల జట్టుతో నువ్వు టీమ్‌ఇండియాలో అడుగుపెట్టావు. పరుగులేమీ చేయకుండానే రనౌట్‌ అయ్యావు. గతేడాది నువ్వాడిన ఆఖరి మ్యాచులో మళ్లీ రనౌట్‌గా వెనుదిరిగావు. కొన్ని చరిత్రలు ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ...

Updated : 04 Sep 2020 17:36 IST

నువ్వే నవ్వించావు‌.. నువ్వే ఏడిపించావు‌..

నువ్వే సంతోషపెట్టావు‌.. నువ్వే బాధపెట్టావు‌..

నువ్వే మునికాళ్లపై నిలబెట్టావు‌.. నువ్వే ఎగిరి గంతేసేలా చేశావు‌..

నువ్వే ఆలోచింపజేశావు‌.. నువ్వే ఆశ్చర్యపరిచావు‌..

ఉద్వేగాలేమీ ప్రదర్శించకుండానే ఇప్పుడు మమ్మల్ని భావోద్వేగంలో ముంచెత్తావు..

గుర్తొస్తున్నావు‌ మహీ.. చాలా చాలా గుర్తొస్తున్నావు‌.. వచ్చేకొద్దీ గుండెల నిండా బరువు పెంచేస్తున్నావ్‌ మహీ!?


పదహారేళ్ల క్రితం జులపాల జుట్టుతో నువ్వు టీమ్‌ఇండియాలో అడుగుపెట్టావు. పరుగులేమీ చేయకుండానే రనౌట్‌ అయ్యావు. గతేడాది నువ్వాడిన ఆఖరి మ్యాచులో మళ్లీ రనౌట్‌గా వెనుదిరిగావు. కొన్ని చరిత్రలు ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ముగుస్తాయి. అలాగే ఈ రెండు రనౌట్లు నీ కెరీర్‌కు ఆద్యంతాలు! అందుకే వాటిని తలుచుకున్నప్పుడల్లా నువ్వు మళ్లీ మళ్లీ గుర్తొస్తావు మహీ!

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలంతో జావగారిపోయిన టీమ్‌ఇండియాకు సౌరవ్‌ గంగూలీ ప్రాణం పోశాడు. తిరుగులేని జట్టును తయారు చేశాడు. 2003 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలబెట్టాడు. నువ్వూ అంతే. 2007లో పాతాళానికి పడిపోయిన జట్టును తిరిగి పైకిలేపావ్‌. అదే ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గెలిపించావు. భారతీయులు 28 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌ను రెండోసారి అందించావు. క్రికెట్‌ పరమపద సోపాన పటంలో ఆశల నిచ్చెనలను ఎక్కించావు. ఛాంపియన్స్‌ ట్రోఫీతో తిరుగులేని ఘనత అందుకున్నావు. వాటిని చదివినప్పుడల్లా నువ్వు మళ్లీ మళ్లీ గుర్తొస్తావు మహీ!

చాలాకాలం వరకు టీమ్‌ఇండియాకు చిరుతలాంటి వికెట్‌ కీపర్‌ దొరకలేదు. ఏ గిల్‌క్రిస్ట్‌నో, మార్క్‌బౌచర్‌నో చూసినప్పుడల్లా మనకూ అలాంటి కీపర్‌ దొరికితే బాగుండూ అనుకునేవాళ్లం. నువ్వా కొరతను తీర్చావు. అంతేకాదు వారి రికార్డులన్నీ బద్దలుకొట్టావు. కనురెప్ప వాల్చేలోపు రాకెట్‌ వేగంతో స్టంపింగ్‌లు చేశావు. వికెట్ల వెనకాల చేతుల్ని మెరుపులా కదిల్చేవాడివి. వయసు పెరిగినా గాల్లో తేలుతూ బంతి అందుకొనేవాడివి. రేప్పొద్దున పంతో, శాంసనో, రాహులో గ్లోవ్స్‌తో ఇంద్రజాలం చేస్తే నువ్వు మళ్లీ మళ్లీ గుర్తొస్తావు మహీ!

జట్టు అన్ననప్పుడు కొత్త కెప్టెన్లు రావడం పోవడం సహజం. వచ్చినవారు డేగకళ్లతో గమనిస్తూ మెరుపు నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో ఓ మ్యాచులో బౌలర్‌ వేసిన బంతి బ్యాట్స్‌మన్‌ బ్యాటును ముద్దాడుతున్నట్టు కనిపించి ప్యాడ్లను తాకుతుంది. అంపైర్‌ ఔటివ్వలేదు. సమీక్ష కోరాలో వద్దో జట్టు సభ్యులు కెప్టెన్‌కు చెప్పలేకున్నారు. ఉన్నది ఒకటే రివ్యూ. తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్‌ విధ్వంసకర వీరుడు. అయినప్పటికీ కెప్టెన్‌ ధైర్యం చేసి డీఆర్‌ఎస్‌ కోరి విఫలమయ్యాడే అనుకో! మాకది ధోనీ రివ్యూ సిస్టమ్‌ అని స్ఫురిస్తుంది. అప్పుడు నువ్వు మళ్లీ మళ్లీ గుర్తొస్తావు మహీ!

తనకు ఇష్టమైన క్రికెటర్‌ను కలవాలని ఎవరికుండదు. ఎలాగోలా ఒక్కసారన్నా ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని ఎవరు కోరుకోరు. ఇక వీరాభిమానులైతే పాదాభివందనమే చేయాలనుకుంటారు! నిబంధనలకు విరుద్ధమే అయినా బారికేడ్లు, పోలీసుల రక్షణ కంచెను దాటేసి మైదానంలో పరుగెత్తుకొస్తారు. తన ఆరాధ్య ఆటగాడిని ప్రేమపూర్వకంగా స్పర్శించేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడా ఆటగాడు చిక్కడు దొరకడు తరహాలో పరుగెత్తి మళ్లీ  అభిమానిని దగ్గరికి తీసుకున్నాడే అనుకో! నువ్వు మళ్లీ మళ్లీ గుర్తొస్తావు మహీ!

టోర్నీలెన్నో ఉంటాయి. మ్యాచులెన్నో జరుగుతాయి. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచులు, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీసులూ అందిస్తూనే ఉంటారు. ఎవరో ఓ ఆటగాడు అన్ని మ్యాచుల్లోనూ సత్తా చాటుతాడు. ఓ స్పోర్ట్స్‌ బైక్‌ను మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా గెలిచి సహచరుడిని ఎక్కించుకొని మైదానంలో నడిపాడే అనుకో! నువ్వూ, యువీ బైక్‌పై తిరిగిన దృశ్యాలు వెంటనే మా కళ్లల్లో మెదులుతాయి. నువ్వు మళ్లీ మళ్లీ గుర్తొస్తావు మహీ!

బ్యాట్స్‌మెన్‌ ఎందరో వస్తారు. కొందరు టాప్‌ ఆర్డర్లో ఆడతారు. మరికొందరు మిడిలార్డర్‌లో స్థిరపడతారు. కానీ ప్రత్యర్థులకు సింహస్వప్నంలా కనిపించే వాళ్లు ఎవరో ఒక్కరే ఉంటారు. అతడు ఆఖరి ఓవర్లో 20 లేదా 25 కొట్టి జట్టును గెలిపించి ఫినిషర్‌గా మారాడే అనుకో! ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడే అనుకో! అప్పుడు నువ్వు మళ్లీ మళ్లీ గుర్తొస్తావు మహీ! ఏదేమైనా నీలాంటి మరో క్రికెటర్‌ రావడం కష్టం. ఎందుకంటే ఎవరికి వారే ప్రత్యేకం. ఎవరికి వారే సాటి. నీకు నువ్వే సాటి. నువ్వు వీడ్కోలు పలికినప్పటికీ ప్రతిసారీ ఎవరో ఒకరు నీ ఉనికి స్మరణకు తెస్తూనే ఉంటారు. అప్పుడు నువ్వు మళ్లీ మళ్లీ గుర్తొస్తావు మహీ!! మళ్లీ మళ్లీ గుర్తొస్తావు!!

- ఇంటర్‌నెట్‌ డెస్క్‌ ప్రత్యేక కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని