Published : 11/10/2020 12:31 IST

ఫుట్‌బాల్‌తో జీవితపాఠాలు

చిత్రాలు: వారి అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి..

ఇంటర్నెట్‌ డెస్క్‌:  అది దిల్లీ నగరంలోని ఓ మురికివాడ. సమయం ఉదయం 3:30. స్పోర్ట్స్‌ దుస్తులు ధరించి ఫుట్‌బాల్‌ ఆడేందుకు మైదానానికి బయలుదేరారు ఆ మురికివాడలో నివసించే పిల్లలు. వీరంతా ఎవరో తెలుసా! ఒకప్పుడు దొంగతనాలు చేసినవారు. తినేందుకు అడుక్కునే వారు. మాదక ద్రవ్యాలకు బానిసలైనవారు. ఒకరైతే ఏకంగా తీవ్రవాదైపోదామనుకున్నారు. కానీ ఇప్పుడు వీరందరూ మారారు. వీరిని మార్చాడో వ్యక్తి. వారి కోసం ఓ అకాడమీ స్థాపించాడు. ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నాడు. ఇంతకీ ఎవరతను? తను స్థాపించిన అకాడమీ ఏంటి? చదివేద్దాం.

    

దిల్లీలోని ఓ మురికివాడ. పేరు వికాస్‌ పురి. అక్కడ పిల్లలందరూ చదువుకు దూరమై, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. తిండి, చదువుకు ఆమడదూరంలో అంధకారంలో బతికేస్తున్న వారిని చూసి చలించిపోయాడో ఓ కుర్రాడు. పేరు సిల్వెస్టర్‌ పీటర్‌. అప్పుడు తన వయసు కేవలం 13 సంవత్సరాలు. వారికి సరైన విద్య అందేలా చూడాలనుకున్నాడు. ఆ సమయంలో తనకొచ్చిన ఆలోచన ఫుట్‌బాల్‌. సంప్రదాయ చదువుల కంటే సమాజాన్ని చదివేలా వారికి ఆటలతో శిక్షణనివ్వాలనుకున్నాడు. అందుకు ఓ అకాడమిని స్థాపించాడు. అదే ‘మై ఏంజెల్స్‌ అకాడమి’. ఫుట్‌బాల్‌ అంటే తనకి చాలా ఇష్టం అందుకే ఆ ఆటతోనే వారిలో మార్పు తేవాలనుకున్నాడు. అలా దగ్గరలోని పబ్లిక్‌ గ్రౌండ్‌ని ఎంచుకుని వారికి ఫుట్‌బాల్‌ శిక్షణనివ్వడం మొదలెట్టాడు. ప్రతి రోజూ ఉదయం 3:30కి శిక్షణ ప్రారంభం. ఆ సమయంలో మైదానంలో ఎవరూ ఉండరు వారు తప్ప.. అందుకే ఆ సమయాన్ని ఎంచుకున్నాడు. రోజూ వచ్చేలా ఆ పిల్లల్లో ఆసక్తి పెంచాడు. గ్రౌండ్‌కి వచ్చీరాగానే వారికి వార్మప్‌ అవసరం. ముందుగా మైదానాన్ని శుభ్రం చేయడమే వారి వార్మప్‌‌. అలా వారికి శుభ్రతపైనా, పర్యావరణంపైనా అవగాహన కల్పించేవాడు. శుభ్రమైన దుస్తులనే ధరించాలని చెప్పేవాడు. ఇలా రోజూ ఉదయం సుమారు 130మంది బాలబాలికలకు శిక్షణనిస్తాడు. గత 29ఏళ్లుగా ఎంతో మంది ఫుట్‌బాల్‌ క్రీడాకారులను తయారు చేశాడు. ప్రయివేటు పాఠశాల విద్యార్థులతో ఫుట్‌బాల్‌ పోటీల్లో తలపడి ఎన్నో విజయాలు అందుకుంది తన ‘మై ఏంజెల్స్‌ అకాడమి’. మైదానంలో పేద ధనిక తేడాలేదని.. ఒక్కసారి మైదానంలో అడుగెడితే అన్నీ మరిచి ఆటలో సత్తా చాటాలని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడీ ఫుట్‌బాల్‌ గురు పీటర్‌.. 

అదొక్కటే కాదు..!
కేవలం ఫుట్‌బాల్‌ మాత్రమే కాదు. జీవితంలో తన కాళ్లపై తాము నిలబడేలా జీవిత పాఠాలను నేర్పుతున్నాడు. ఒక్కపూట తిండి కోసం ఇంటింటికీ తిరిగే పిల్లలు ఇప్పుడు స్వయంగా వంట చేసి ఇతరుల కడుపునింపుతున్నారు. ఎప్పుడూ గొడవలు, అల్లర్లతో కుస్తీలు పట్టే బాలలకి యోగా, వ్యాయామంతో శాంతి పాఠాలను నేర్పుతున్నాడు. అంతేకాదు వారికి నచ్చిన రంగాల్లో వారు స్థిరపడేలా నాట్యం, సంగీతం, చెస్‌, డిజైనింగ్‌, పేయింటింగ్‌, కంప్యూటర్‌ విద్య..  ఇలా అనేక రంగాల్లో వారి ప్రతిభను నిరూపించుకునేలా వారిని ప్రోత్సహిస్తున్నాడు. జీవితంలో సమయపాలన, సహనం, గెలుపోటములను స్వీకరించేతత్వం.. ఇవి ముఖ్యమని చెబుతూ వారిని అభివృద్ధి పథంలోకి సాగనంపుతున్నాడు. వీలైనపుడు విహారయాత్రలకు తీసుకెళ్తూ వారికి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాడు. తన సొంత డబ్బు, స్నేహితులు, దాతల ప్రోత్సాహంతో వీటన్నింటికీ కార్యరూపం దాల్చేలా చూస్తున్నాడు.

అదే తన సంతోషం

తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడిన పీటర్‌కి చదువు విలువ తెలుసు. చదువంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదంటాడు. సమాజం పట్ల ఓ అవగాహన కలిగి ఉండాలంటాడు. తోటి వారు ఆపదలో ఉంటే సహాయం చేయాలంటాడు. అలా తన సంస్థ ద్వారా ఎంతో మంది దొంగతనాలకు అలవాటుపడిన వారిని, అడుక్కునే పిల్లలని, కాగితాలు ఏరుకునే చిన్నారులని మార్చానని అదే తనకి  సంతృప్తినిస్తుందని చెబుతుంటాడు. తన వద్ద శిక్షణ తీసుకున్న కొందరు ఇప్పడు ఫుట్‌బాల్‌ ప్లేయర్లుగా, కోచ్‌లుగా మారారు. అంతేకాదు ‘లెర్న్‌ అండ్‌ ఎర్న్‌’ ప్రోగ్రామ్‌ ద్వారా అక్కడే నేర్చుకుని సంపాదించుకునేలా చేస్తోందీ తన అకాడమి. ఇక్కడి నుంచి వెళ్లిన వారు కష్టపడి చదివి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలనీ సంపాదించారు. నెలనెలా వారి జీతంతో సగభాగం సంస్థ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తుంటారని పీటర్‌ చెబుతుంటాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని