Published : 07/09/2020 14:27 IST

ఈ ఘటనంతా బాధకు గురిచేస్తోంది: జకోవిచ్‌

మనసారా క్షమాపణలు.. అనుకోకుండా జరిగింది..

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఎస్‌ ఓపెన్‌ 2020లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సెర్బియన్‌ స్టార్‌ నోవాక్‌ జకోవిచ్‌ ఆదివారం నాలుగో రౌండ్‌ సందర్భంగా అర్ధాంతరంగా నిష్క్రమించాడు. గతరాత్రి మ్యాచ్‌ ఆడేటప్పుడు అతడు అనుకోకుండా కొట్టిన ఓ బంతి లైన్‌ అంపైర్‌కు తగలడంతో ఆమె గొంతకు గాయమైంది. దీంతో నిబంధనల ప్రకారం జకోవిచ్‌ను ఈ మెగా టోర్నీ నుంచి తొలగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన టెన్నిస్‌ స్టార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. అందులో జకోవిచ్‌ ఎంతో భావోద్వేగం చెందాడు.

‘ఈ ఘటనంతా నన్ను బాధకు గురిచేస్తోంది. లైన్‌ అంపైర్‌ను పరిశీలించాను. అదృష్టంకొద్దీ ఆమె బాగానే ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ఇదంతా అనుకోకుండా జరిగింది. ఆమెకు ఇబ్బంది కలిగించినందుకు మనసారా క్షమాపణలు చెబుతున్నా. ఆమె వ్యక్తిగత సమాచారానికి భంగం కలగకూడదనే నేను పేరును వెల్లడించడంలేదు. ఇక నన్ను టోర్నీ నుంచి తీసేయడం బాధగా ఉంది. నేను చేసింది తప్పే. ఇంటికి వెళ్లి దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ ఘటన నాకో గుణపాఠం లాంటిది. కెరీర్‌లో ఆటగాడిగా ఎదిగేందుకు, మనిషిగా జీవించేందుకూ తోడ్పడుతుంది. ఈ సందర్భంగా యూఎస్‌ ఓపెన్‌కూ క్షమాపణలు చెబుతున్నా. దీని వల్ల ఇబ్బందికి గురైన ప్రతీ ఒక్కర్నీ మన్నించమని కోరుతున్నా. ఇక ఇలాంటి సమయంలో నాకు అండగా నిలిచిన నా బృందం, కుటుంబం, ఎల్లవేళలా వెన్నంటే ఉండే అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ధన్యవాదాలు’ అని జకోవిచ్‌ తన బాధను పంచుకున్నాడు.

అయితే, జకోవిచ్‌పై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడు కోపంతోనే చేశాడని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం అనుకోకుండానే జరిగిందని పేర్కొంటున్నారు. అలాగే ఆ సమయంలో కోర్టులో ఏం జరిగిందనే వీడియోను కూడా పోస్టు చేస్తూ అతడికి అండగా నిలుస్తున్నారు. అనుకోకుండా అతడు ఓ బంతిని కొట్టడంతోనే అది నేరుగా వెళ్లి లైన్‌ అంపైర్‌కు తగిలినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనతో నాలుగో సారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలవాలన్న అతడి కోరిక వృథా అయింది. ఇప్పటికే మూడు రౌండ్లు గెలిచిన అతడు ఇది గెలిస్తే క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరేవాడు. మరోవైపు ఈ గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌లో ఇతడికి తగ్గ ప్రత్యర్థులు లేకపోవడంతో టైటిల్‌ ఫేవరెట్‌గానూ నిలిచాడు. అలాంటి దిగ్గజం ఇలా నిష్క్రమించడంతో టెన్నిస్‌ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్