రహానె ప్రత్యేకత అదే!

విరాట్ కోహ్లీ గైర్హాజరీతో ఆస్ట్రేలియా పర్యటనలో భారత టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అజింక్య రహానె అందుకున్నాడు. తొలి టెస్టులో ఘోరపరాజయం, కోహ్లీ, షమి జట్టుకు దూరమైన ప్రతికూల పరిస్థితుల్లో....

Published : 24 Dec 2020 01:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్ కోహ్లీ గైర్హాజరీతో ఆస్ట్రేలియా పర్యటనలో భారత టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అజింక్య రహానె అందుకున్నాడు. తొలి టెస్టులో ఘోరపరాజయం, కోహ్లీ, షమి జట్టుకు దూరమైన ప్రతికూల పరిస్థితుల్లో.. రహానె టీమిండియాను ఎలా నడిపిస్తాడని అందరిలో ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే రహానెలో ఉండే ప్రశాంతత, బౌలర్లపై అతడు ఉంచే నమ్మకమే భారత్‌ను విజయపథంలో నడిపిస్తుందని సీనియర్‌ బౌలర్ ఇషాంత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇషాంత్ పక్కటెముకల గాయంతో ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే.

‘‘రహానె చాలా ప్రశాంతంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. విరాట్‌ కోహ్లీ లేనప్పుడు, మేం కలిసి ఆడిన సందర్భాల్లో.. నీకు ఎలాంటి ఫీల్డింగ్ కావాలి? ఎక్కడ బంతుల్ని వేయాలనుకుంటున్నావ్‌? బౌలింగ్ చేస్తావా? అని అతడే వచ్చి అడిగేవాడు. రహానె బౌలర్ల కెప్టెన్‌. ఇలా బౌలింగ్ చేయి, అలా ఆడు.. అని అతడు చెప్పేవాడు కాదు. జట్టు నుంచి ఉత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో అతడికి స్పష్టత ఉంది’’ అని ఇషాంత్ తెలిపాడు. కోహ్లీ గైర్హాజరీలో రహానె ఇప్పటివరకు రెండు టెస్టులకు కెప్టెన్సీ చేయగా రెండింట్లోనూ విజయం సాధించాడు.

‘‘రహానె భావోద్వేగాల్ని నియంత్రణలో ఉంచుకుంటాడు. అలా అని అతడికి హాస్యచతురత లేదని కాదు. మాతో ఎంతో సరదాగా ఉంటాడు. అయితే అతడి ప్రశాంతతే జట్టులో ఉత్సాహన్ని నింపుతుంది. ఒత్తిడిలో కంగారు లేకుండా బౌలర్లతో తన అభిప్రాయాలను స్పష్టంగా చెబుతాడు’’ అని ఇషాంత్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే ఆటగాళ్లలో కలిగే ఉత్సాహం వేరని, అతడిలా మరెవరు జట్టును ఉత్తేజపరచలేరని ఇషాంత్‌ అన్నాడు. పితృత్వ సెలవులపై కోహ్లీ స్వదేశానికి బయలుదేరిన విషయం తెలిసిందే.

కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉంది. మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్ 26 నుంచి భారత్×ఆసీస్‌ రెండో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

సన్నీ×అనుష్క..రోహిత్×కోహ్లీ..బంగ్లా ‘అతి’

కరోనా నిబంధనలు: వార్నర్‌కు షాక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని