Published : 09/11/2020 20:52 IST

టెస్టు పగ్గాలు రోహిత్‌కే ఇవ్వాలి: పఠాన్‌

ఇంటర్నెట్‌డెస్క్: భారత సారథి విరాట్‌ కోహ్లీ పితృత్వ సెలవుల్లో ఉన్నప్పుడు టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెకు బదులుగా రోహిత్‌ శర్మకు టెస్టు పగ్గాలు అందివ్వాలని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. రహానెకు తానేమి వ్యతిరేకం కాదని, కానీ కెప్టెన్సీలో అనుభవజ్ఞుడైన హిట్‌మ్యాన్‌కు బాధ్యతలు అందిస్తే సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ 2021, జనవరిలో ప్రసవించే అవకాశం ఉండటంతో విరాట్ పితృత్వ సెలవులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత అతడు భారత్‌కు తిరిగొస్తాడని బీసీసీఐ వెల్లడించింది.

‘‘విరాట్‌ కోహ్లీ లేకపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ కోహ్లీ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. క్రికెట్‌కు మించిన జీవితం ఉంటుంది. కుటుంబం ఎంతో ముఖ్యం. అయితే అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గత కొన్నేళ్లుగా అన్నిరకాల పరిస్థితుల్లో అతడు గొప్పగా రాణించాడు. కాగా, కోహ్లీ గైర్హాజరీలో రహానెకు బదులుగా రోహిత్‌శర్మ జట్టును ముందుండి నడిపించాలి. రహానెకు నేను వ్యతిరేకం కాదు. కానీ నాయకుడిగా రోహిత్‌ నిరూపించుకున్నాడు. కావాల్సిన అనుభవం ఉంది. అంతేగాక, ఓపెనర్‌గా అతడి పాత్ర ఎంతో కీలకం’’ అని పఠాన్‌ తెలిపాడు.

‘‘2008లో కంగారూల గడ్డపై తన తొలి వన్డే సిరీస్‌లోనే రోహిత్‌ గొప్పగా ఆడాడు. అనుభవం లేని పిచ్‌లపై మంచి ప్రదర్శన చేశాడు. ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ఆడనున్నాడు. పరుగుల దాహంతో ఉన్న రోహిత్ ప్రత్యర్థి జట్టుకు అత్యంత ప్రమాదకరం. విదేశాల్లో ఆడటం అంటే కఠిన సవాలే, అయితే రోహిత్‌ ఫామ్‌లో ఉంటే పరిస్థితులతో సంబంధం ఉండదు. 2004లో ఓపెనర్‌గా సెహ్వాగ్‌ జట్టుకు విజయాల్ని అందించనట్లే రోహిత్ కూడా సాధించగలడు. అంతేగాక, మూడో స్థానంలో వచ్చే పుజారా కూడా ఎంతో కీలక ఆటగాడు. అతడు కొత్త బంతుల్ని ఎదుర్కొంటూ భాగస్వామ్యాల్ని నెలకొల్పుతాడు. నాలుగో స్థానంలో రహానె బ్యాటింగ్‌కు రావాలి. మరోవైపు కోహ్లీ జట్టులో లేకపోవడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. కానీ బలమైన బౌలింగ్‌, బ్యాటింగ్‌ లైనప్‌ మన సొంతం. ఆస్ట్రేలియా పర్యటన ఆసక్తికరంగా సాగుతుంది’’ అని పఠాన్‌ వెల్లడించాడు. ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటన నవంబర్‌ 27 నుంచి ప్రారంభం కానుంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని