సచిన్‌.. ‘ఒక్కఛాన్స్‌ ప్లీజ్‌’ అన్నప్పుడు

సచిన్‌ రమేశ్‌ తెందూల్కర్‌ ఇండియన్‌ క్రికెట్‌కు సరికొత్త ఆకర్షణ. భారతదేశ ఖ్యాతిని ప్రపంపచస్థాయిలో చాటిచెప్పిన వ్యక్తి. సచిన్‌ గురించి చెప్పాలంటే చాలానే ఉంటాయి. క్రికెట్‌లో రికార్డుల గురించి మాట్లాడితే.. సచిన్‌ పేరు ప్రస్తావించక తప్పదు.

Updated : 26 Sep 2020 17:24 IST

ఓపెనర్‌గా అవకాశం గురించి వెల్లడించిన మాస్టర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సచిన్‌ రమేశ్‌ తెందూల్కర్‌ ఇండియన్‌ క్రికెట్‌కు సరికొత్త ఆకర్షణ. భారతదేశ ఖ్యాతిని ప్రపంపచస్థాయిలో చాటిచెప్పిన వ్యక్తి. సచిన్‌ గురించి చెప్పాలంటే చాలానే ఉంటాయి. క్రికెట్‌లో రికార్డుల గురించి మాట్లాడితే.. సచిన్‌ పేరు ప్రస్తావించక తప్పదు. 100శతకాలు.. 34,347 పరుగులు, 200 టెస్టులు, 463 వన్డేలు.. ఇదీ సచిన్‌ ట్రాక్‌ రికార్డు. ఈ ఘనతలు చాలు మాస్టర్‌ క్లాస్‌ బ్యాట్స్‌మన్‌ను వర్ణించడానికి. ఇదంతా ఇప్పుడెందుకంటే.. ఏ బ్యాట్స్‌మెన్‌కైనా టాలెంట్‌ ఉంటే సరిపోదు. అవకాశాలూ కలిసిరావాలి కదా. సచిన్‌కూ ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ అవకాశం రావడమే ఇన్ని రికార్డులు నమోదు చేయడానికి ఓ కారణం. మరి తెందూల్కర్‌కు ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ అవకాశం ఎలా వచ్చిందో.. ఎవరిచ్చారో తెలుసా..?
తాను ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నప్పటికీ తన కెరీర్‌లో ప్రోత్సహించి, సహకరించిన ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటాడు సచిన్‌. తాజాగా.. తాను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఓపెనింగ్‌ రావడాటానికి కారణమైన క్రికెటర్‌ పేరు వెల్లడించాడు. అది మరెవరో కాదు.. మన భారత జట్టు మాజీ సారథి అజారుద్దీన్‌. ఆకాశ్‌ చోప్రాతో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సచిన్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

1990లో న్యూజిలాండ్‌తో ఓ వన్డే మ్యాచ్‌ సందర్భంగా ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌ నవజ్యోత్‌సింగ్‌సిద్దూ మెడ నొప్పికి గురయ్యాడు. తాను మ్యాచ్‌ ఆడలేనని కోచ్‌కు చెప్పాడు. సచిన్‌ అప్పటికే వన్డే జట్టులో సభ్యుడు. తనను ఓపెనింగ్‌ బ్యాటింగ్‌కు పంపించే అవకాశం ఉంటే పరిశీలించాలని, ఓపెనింగ్‌లో రాణించగలనన్న నమ్మకం ఉందని కోచ్‌ వాడేకర్‌, కెప్టెన్‌ అజారుద్దీన్‌ను కోరాను. ‘నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. మీ నమ్మకం నిలబెట్టకపోతే మళ్లీ ఇంకోసారి ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ గురించి ప్రస్తావించను’ అని చెప్పాను. సచిన్‌పై నమ్మకం ఉంచిన అజారుద్దీన్‌ కోచ్‌ను ఒప్పించాడు. అలా సచిన్‌కు ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌ తర్వాత నుంచి సచిన్‌ ఒక బ్యాట్స్‌మన్‌గా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

ఇంతకీ ఆ మ్యాచ్‌లో సచిన్‌ ఎన్ని పరుగులు చేశాడో తెలుసా..? 49 బంతుల్లోనే 82 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌తో ఔరా అనిపించాడు. ఆ తర్వాత మరోసారి ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ గురించి అడగాల్సిన అవసరం సచిన్‌కు రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని