ధోనీ విషయంలో బీసీసీఐ ప్రవర్తన సరిగ్గా లేదు 

గతేడాది వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలయ్యాక మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్‌ ఆడి జట్టులోకి వస్తాడని

Published : 24 Aug 2020 00:36 IST

భారత క్రికెట్‌ బోర్డుపై పాక్‌ మాజీ క్రికెటర్‌ ఏమన్నాడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలయ్యాక మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్‌ ఆడి జట్టులోకి వస్తాడని ఆశించినా గతవారం స్వాతంత్ర్య దినోత్సవం రోజున అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే, ఈ విషయంలో బీసీసీఐ సరిగ్గా వ్యవహరించలేదని, అంత గొప్ప సారథికి సరైన వీడ్కోలు ఇవ్వలేదని పాకిస్థాన్‌ మాజీ కీపర్‌ సక్లైన్‌ ముస్తాక్‌ పేర్కొన్నాడు. మహీ వీడ్కోలు పలికాక తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ ఇలా అన్నాడు. 

ప్రతీ క్రికెటర్‌కి జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని, ఆటకు వీడ్కోలు చెప్పక తప్పదని ముస్తాక్‌ అన్నాడు. అలాగే ధోనీ తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని, అతడో గొప్ప ఆటగాడే కాకుండా అత్యత్తమ ఫినిషర్‌, పోరాడే నాయకుడు, నిరాడంబర వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. చూడ్డానికి ఎంత ప్రశాంతంగా కనిపించినా అతడు చాలా ప్రభావితం చేస్తాడన్నాడు. మహీ సామాన్యమైన ఆటగాడు కాదని, నూటికి ఒక్కడని ప్రశంసించాడు. అతడి పేరూ, గౌరవం అలా నిలిచిపోతాయని చెప్పాడు. టీమ్‌ఇండియా ఇప్పుడున్న స్థితికి అతడే పెద్ద కారణమని పేర్కొన్నాడు. అలాగే అతడిని అనుకరించి, అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉన్నారని, వాళ్లంతా ధోనీని చివరి మ్యాచ్‌లో చూడాలనుకుంటారని అభిప్రాయపడ్డాడు.

ఈ క్రమంలోనే మాట్లాడుతూ తాను ఎవరిమీదా తప్పుగా మాట్లాడనని చెప్పాడు. అయితే, ధోనీ విషయంలోనే మనసు ఆగలేక ఇలా స్పందించాల్సి వచ్చిందని వివరించాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అతడితో సరిగ్గా ప్రవర్తించలేదని తెలిపాడు. అంత గొప్ప ఆటగాడికి సరైన పద్ధతిలో వీడ్కోలు పలకలేదన్నాడు. ధోనీ కోట్లాది మంది అభిమానులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారన్నాడు. ఇలా అన్నందుకు బీసీసీఐకి క్షమాపణలు చెబుతున్నట్లు వివరించాడు. ప్రతీ క్రికెటర్‌ కూడా గొప్పగా వీడ్కోలు అందుకోవాలనుకుంటాడని, ఆ విషయంలో ధోనీ కూడా అతీతుడు కాదని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. చివరగా టీమ్‌ఇండియా మాజీ సారథి అసలైన హీరో అని, అతడో వజ్రం వంటి మనిషని కీర్తించాడు. మహీ పట్ల గర్వంగా ఉందని ముస్తాక్‌ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని