శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలో నడిచాం : స్టోయినిస్‌

తను సారథి కాకపోయినప్పటికీ దిల్లీ జట్టు ఈ ఏడాది శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలో నడిచిందని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ అన్నాడు. తన ఆటతీరుతో శిఖర్‌ జట్టును ప్రభావితం చేశాడని ధావన్‌ను ప్రశంసించాడు. ఈ సీజన్‌లో జట్టు కోసం చాలా సార్లు శిఖర్ గొప్ప ఇన్నింగ్స్‌

Published : 10 Nov 2020 01:50 IST

అబుదాబి: దిల్లీ జట్టు ఈ ఏడాది శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలో నడిచిందని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ అన్నాడు. అతని ఆటతీరుతో శిఖర్‌ జట్టును ప్రభావితం చేశాడని ధావన్‌ను ప్రశంసించాడు. ఈ సీజన్‌లో జట్టు కోసం పలుమార్లు శిఖర్ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడినట్లు స్టోయినిస్‌ తెలిపాడు. భిన్న పరిస్థితుల్లో గొప్పగా ఎలా రాణించాలో ధావన్‌ నుంచి నేర్చుకుంటున్నట్లు హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం స్టొయినిస్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా స్టొయినిస్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు శ్రేయేస్‌ అయ్యర్‌ కెప్టెన్‌ అయినప్పటికీ ధావన్‌ ఆటగాళ్లను ముందుండి నడిపించాడని పేర్కొన్నాడు. 

లీగ్‌ ఆరంభంలో విజయాలతో దూకుడుగా ఆడిన దిల్లీ చివర్లో వరుస ఓటములతో ఒత్తిడిలోకి వెళ్లింది. ఈ సమయంలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ధావన్‌ జట్టులో జోష్‌ నింపాడని స్టొయినిస్‌ అన్నాడు. లీగ్‌లో ఇప్పటి వరకూ రెండు శతకాలు బాదిన ధావన్‌ 603 పరుగులు చేశాడు. ఆదివారం జరిగిన కీలకమైన క్వాలిఫైయర్‌-2 మ్యాచులోనూ శిఖర్‌ 78 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు. ఇప్పటికే ఆరువందలకు పైగా పరుగులు చేసిన ధావన్‌కు ఫైనల్‌లో భారీ స్కోరు చేసే పని మిగిలి ఉందని స్టొయినిస్‌ అభిప్రాయపడ్డాడు.

ధావన్‌తో పాటు దిల్లీ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేస్తున్న స్టొయినిస్‌ లీగ్‌లో 352 పరుగులు చేసి 12 వికెట్లు తీశాడు. ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఓపెనర్‌గా వచ్చిన ఈ ఆల్‌రౌండర్‌ 38 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసి మూడు కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్‌ చేజారుతుందనే సమయంలో ఫామ్‌లో ఉన్న మనీశ్‌పాండేతో పాటు విలియమ్‌సన్‌ను ఔట్‌ చేసి దిల్లీ విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇదిలా ఉంటే టైటిల్‌ పోరులో తొలిసారి ఫైనల్‌కు చేరిన దిల్లీ మంగళవారం డిఫెడింగ్ ఛాంపియన్‌ ముంబయితో ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని