ప్రధాని ఫోన్‌ చేసి.. ధోనీని ఒప్పించాలి 

వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌ ఆడాకే ధోనీ వీడ్కోలు పలకాలని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఏడాది కాలంగా ఆటకు దూరమైన మహీ స్వాతంత్ర్య ...

Updated : 18 Aug 2020 16:16 IST

మహీపై భారీ ఆశలు పెట్టుకున్న షోయబ్‌ అక్తర్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌ ఆడిన తర్వాతే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఏడాది కాలంగా ఆటకు దూరమైన మహీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు జట్టుకు చేసిన సేవలపై క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమ్‌ఇండియాకు అతడు అందించిన విజయాల్ని, జట్టును నడిపించిన తీరును మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన అక్తర్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ ధోనీ ఆటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘మాజీ సారథికి భారత్‌లో అమితమైన అభిమానులున్నారు. తన ఆటతో యావత్‌ దేశాన్ని మైమరిపించాడు. అతడు టీ20ల్లో అయినా ఆడాల్సింది. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్‌ గెలిచాకే వీడ్కోలు పలకాల్సింది. ధోనీ సాధించలేనిది ఏదీ లేదు. రాంచీ లాంటి చిన్న పట్టణం నుంచి వచ్చి దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. భారత్‌ అతడిని ఎప్పటికీ మర్చిపోదు’ అని కొనియాడాడు. అలాగే భారత ప్రధాని నరేంద్రమోదీ ధోనీకు ఫోన్‌ చేసి మాట్లాడొచ్చని.. వచ్చే టీ20 ప్రపంచకప్‌ గెలిచాకే వీడ్కోలు పలకమని కోరాలని అన్నాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఐపీఎల్‌లో మరి కొన్నాళ్లు కొనసాగుతాడని, సీఎస్కే తరఫున చెలరేగిపోతాడని అక్తర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడింకా ఆ జట్టుకు ఒకటో రెండో టైటిళ్లు అందించాలనే ఉద్దేశంతో ఉన్నాడని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని